
గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.
మంగళవారం గిద్దలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలధార–జలహారతి కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని 176 చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులను త్వరగా పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అలాగే రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా మ్యూటేషన్లు సరిగా జరగడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే మత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. అలాగే విద్యుత్ సమస్యలు లేకుండా 11, 22 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆయా గ్రామ ప్రజలకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ఈ అబూతలిం, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.