
ఎస్.కోట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్.కోటలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సురక్షితమైన పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అగ్ని ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉండే కారణంగా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి (సి.ఐ/ఎస్.ఎఫ్.ఓ) భద్రతా ప్రమాణాలపై వివరించారు. ప్రతి భవనంలో ఐ.ఎస్.ఐ మార్క్ ఉన్న విద్యుత్ వైర్లను మాత్రమే వినియోగించాలని, సరైన ఎం.సి.బిలను అమర్చుకోవాలని, షార్ట్ సర్క్యూట్లను నివారించాలన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ వినియోగం నివారించి మెట్ల మార్గాలను ఖాళీగా ఉంచాలని సూచించారు. ప్రమాదం జరిగితే వెంటనే 101 లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 9100108101 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, బీజేపీ నాయకులు సూర్యారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు డోకుల అచ్చిం నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ జి.ఎస్. నాయుడు, జనసేన టౌన్ అధ్యక్షులు మోపడ చిన్ని, ఎన్సిసి కేడెట్స్, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మాక్ డ్రిల్ మరియు అగ్ని నియంత్రణ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.