
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని, ఇకపై మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని సంకేతాలు ఇచ్చారు.
దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఖమేనీ, పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రజలు, సైన్యం చూపిన ధైర్యంతోనే ఇది సాధ్యమైందన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదని స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో హర్మూజ్ జలసంధిపై మరింత నియంత్రణ కోరనున్నట్లు తెలిపారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం డిమాండ్ చేస్తామని వెల్లడించారు.
దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, బాధితులకు పరిహారం ఇవ్వాలని అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేసిన ఖమేనీ, తమ హక్కులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని హెచ్చరించారు. అవసరమైతే ప్రతీకారం తీసుకోవడంలో వెనుకాడబోమని తెలిపారు.
అదే సమయంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే దేశానికి మద్దతుగా వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.