సూరంపాలెంలో అవినీతి జరుగుతుంటే హోం మంత్రి గారు ఏం చేస్తున్నారు ? – జనసేనాని…

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం బహిరంగ సభలో జనసేనాని ప్రసంగం 

* ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, ఆడపడుచులకు, ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు.

* ప్రేమ తరంగాలతో నన్ను ముంచెత్తుతున్న నా జనసైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

* 2003 నుండి వున్న ఆలోచన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మనవి రాజకీయ పలుకుబడి వున్న కుటుంబాలు కావు, సాధారణ కుటుంబాలు.

* రాజమండ్రిలో ప్రేమతో అవినీతిపై పోరాటం చేద్దామని ఒక్క పిలుపు ఇస్తే 10 లక్షల మంది వచ్చారు. మిగతా రాజకీయ పార్టీలలా సారా ప్యాకెట్లకో, బిర్యానికో కవాతుకు అన్ని లక్షల మంది రాలేదు.

* దశాబ్దాల పాటు నాకు స్వార్ధంగా బతుకుతున్నాను అనిపించింది. అందుకే ఆ స్వార్ధాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. మా అమ్మ నాతో నువ్వు రాజకీయాల్లో ఉన్నంత ఆనందంగా ఇంతకు ముందు లేవురా అని అన్నది. 

* మీ గుండెల్లో నాకు ఇచ్చిన స్థానాన్ని నా బిడ్డల కోసమో, నా కుటుంబం కోసమో నేను ఉపయోగించలేదు, మీకు తిరిగి ఏమి ఇవ్వగలను అని సంవత్సరాల నుండి ఆలోచించాను. జనసేన పార్టీ ద్వారా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

* రాజకీయాల్లో దూకడం అంత తేలిక కాదు. ఒకవైపు వేల కోట్ల ఆస్తులు వున్న పార్టీ, ఇంకో వైపు కుటుంబ నేపధ్యాలు కలిగిన పార్టీ, మనం అంతకముందు 2009లో దెబ్బ తిని వున్నాం..ఇలాంటి పరిస్థితుల్లో 2014లో పార్టీ పెట్టడానికి కారణం నా అన్నదమ్ముల మీద, అక్కాచెల్లెళ్ల మీద నాకు వున్న నమ్మకం.

* 2018 మార్చ్ 14న నేను తెలుగుదేశం చేసిన అవినీతి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మారిపోయాడు అని తెలుగుదేశం వారు అన్నారు. నేను వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడితే నన్ను తప్పు పట్టారు.

* దేవుళ్ళు లేని ఊర్లో మంచం కోడే పోతురాజు అంటారు. మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ లేరు, భగత్ సింగ్, అంబేద్కర్ లు లేరు. మనకి ఉన్నదల్లా చంద్రబాబు గారు, జగన్ గారు, లోకేష్ గారు..వాళ్ళే మనకి గాంధీలు.

* జగన్ గారు కేసుల్లో ములిగిపోయి వున్నారు, ఉన్నవారిలో చంద్రబాబు గారే అనుభజ్ఞులు అని 2014లో తెలుగుదేశానికి మద్దతు తెలిపాను.

* రాష్ట్ర విభజన అనే చిన్న సమస్యను గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా చేసుకుని ఆ సమస్యను పెనుభూతంగా చేసి మనకి ఇబ్బంది కలిగించారు. ఇలాంటి సమయంలో బాధ్యతతో కూడిన వ్యక్తులు రావాలి అని ఇంటి నుండి బయటకు వచ్చేసాను. సొంత అన్నయ్యని, కుటుంబాన్ని వదిలి మీకోసం వచ్చాను. 

* మనకి స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ కావాలి, అది కావాలి అంటే అన్నిటిని వదులుకుని రావాలి. నేను ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలు చదివాను. ఎవరున్నా లేకపోయినా పర్లేదు అనుకుని ఆ జీవిత చరిత్రల స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. 

* దేవుడని మొక్కితే దెయ్యం అయ్యి కూర్చున్నట్టుగా తెలుగుదేశం అవినీతి చెయ్యదుగా అని అనుకుంటే మొత్తం అవినీతిమయం చేసేసారు.

* సీఎం, పవర్ స్టార్ అనేది మంత్రం..అదే పనిగా ఆ మంత్రాన్ని జపిస్తే ఇదొక రోజున మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. ముఖ్యమంత్రి పదవి నాకు చాలా బాధ్యతతో కూడి ఉంది. 

* ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అవినీతి ఎక్కడ ఉంది అని అడుగుతారు, సూరంపాలెం వచ్చి చుస్తే అవినీతి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను.

* తెలుగుదేశం వ్యవస్థాపకులు, లోకేష్ గారి తాత గారు, ముఖ్యమంత్రి గారి మావయ్య అయినటువంటి ఎన్టీ రామారావు గారు సూరంపాలెంలో దళితులకు భూములు ఇస్తే!!ఇప్పుడు ఆ  యజమానులను భయపెట్టి, మభ్య పెట్టి ఎకరానికి రెండున్నర కోట్లు సంపాదిస్తున్నారు. దీనిని అవినీతి కాక ఏమంటారు? ఒక్క సూరంపాలెం గ్రామంలోనే 2000 వేల కోట్ల విలువైన మట్టిని తవ్వేసి అమ్ముకున్నారు.

* లోకేష్ గారు మాట్లాడితే మా తాత గారు, తాత గారు అంటారు కదా! ఆ తాత గారి మీద లోకేష్ గారికే ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రి గారికి తన సొంత మావయ్య మీద గౌరవం ఉంటే ఆయన ఇచ్చిన 470 ఎకరాల భూములను దళితులకు ఇస్తే వాటి మీద కూడా మీరు దోపిడీ చేస్తే మిమ్మల్ని ఏమనాలి?  లోకేష్ గారు సూరంపాలెం వస్తే ఆధారాలతో సహా ఆయనకి జరిగిన దోపిడీ తెలియజేస్తాను. 

* హోంమంత్రి చినరాజప్ప గారు ఏమి చేస్తున్నారు ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంటే!!కడియం రైతులు రెండు అంగుళాలు మట్టి తవ్వితే వారి మీద కేసులు పెడుతున్నారు, అలాంటిది సూరంపాలెంలో 100 అడుగుల లెక్క మట్టిని తవ్వుతుంటే మీరు హోంమంత్రి గారు ఏమి చేస్తున్నారు.  

* ఆర్ధికమంత్రిగా వున్న యనమల రామకృష్ణ గారు దొడ్డి దారిన మంత్రి అయ్యారు, ఎమ్మెల్యేగా గెలవకుండా ఎమ్మెల్సి పదవితో మంత్రి పదవి పొందారు. మీ అనుభవాన్ని మేము కాదనట్లేదు గాని మీ పాలనా దక్షత, మీ తెలివితేటలు 2000 కోట్లు దోచుకోవడానికి ఉపయోగపడింది కాని దళితుల భూములను కాపాడలేకపోయింది. ఇది మీకు సిగ్గుచేటు.

* అడిగేవారు ఎవరూ లేరు. జగన మోహన్ గారు దోపిడీ మీద అడగరు. వారు కూడా ఇందులో వాటాలు అడుగుతున్నారేమో!!పాదయాత్రల పేరుతో బుగ్గలు నిమరడం..ముద్దులు పెట్టడం కాదు..అలా చెయ్యండి తప్పులేదు గాని అదే పనిగా అదే చెయ్యకూడదు. ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభలకు వెళ్లి దళితుల భూములు దోచేసారే అని ఎందుకు నిలదీయలేదు.

* అవినీతితో కూరుకుపోయిన అధికార, ప్రతిపక్షాలు మనకెందుకు…అవినీతి లేని పాలన జనసేన మీకు అందిస్తుంది. 

* డబ్బు వున్నవాళ్ళలో, గొప్ప వాళ్లలో ఎంత విలువ ఉందో నాకు తెలియదు గాని పొద్దున్న నేను మాట్లాడిన రెల్లి ఆడపడుచులలో చాలా విలువలు ఉన్నాయి. మహా మేధావులు మాట్లాడినట్టు ఒక మహిళ మాట్లాడింది. ఆమె చెప్పినట్టు జవాన్లను, రైతులను, పారిశుధ్య కార్మికులను నిండు హృదయంతో జనసేన ఎల్లప్పుడూ భగవంతుడిలా కొలుస్తుంది. 

* నాకు కనిపించే దేవుళ్ళు రైతులు, సైనికులు, కార్మికులు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆడపడుచులకు..అన్నదమ్ములకు అండగా నిలబడతాము.

* నిన్న వంతాడ గ్రామానికి వెళ్తే పచ్చని అడవులు వున్నాయి, అవి మనకి ఆక్సిజన్ అందిస్తాయి. అక్కడ ఘనులు తవ్వుతున్నారు, అది తెలిసి నేను చూడడానికి వెళ్తే మా కార్లకు రాళ్ళ గుట్టలను, మట్టి గుట్టలను అడ్డంగా వేశారు. అలాంటి చర్యలకు మేము అస్సలు భయపడం.

* ప్రజా సమస్యల మీద పోరాడడానికి త్రికరణశుద్ధితో వచ్చాం. మేము అన్నిటికీ తెగించి వచ్చాం..ప్రాణ త్యాగానికి సిద్దపడి వచ్చాం..నాకు మార్పు లక్ష్యం. గెలుపనేది పరిణామ క్రమం. సామాజిక మార్పు అనేదే మా అంతిమ లక్ష్యం.

* నేను చాలా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లే వ్యక్తిని. కాని నన్ను రెచ్చగొడితే అంతు చూస్తాను.

* ఏ స్వార్ధం లేకుండా రాజకీయాల్లోకి వచ్చినోడిని, 100ల కోట్లను వదిలి వచ్చిన వాడిని. కోట్లు వదిలి వచ్చానంటే కోట్లు సంపాదించడానికి కాదు, ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చాను. మీకు అండగా ఒకడున్నాడు అని చెప్పుకునేలా ఉండడానికి వచ్చాను.

* నేను మిమ్మల్ని బూతులు తిడితే దారిలోకి వచ్చే వ్యక్తులు కారు. మిమ్మల్ని రాజ్యాంగపరంగా కేసులు పెట్టి నట్లు, బోల్ట్లు బిగించి వదులుతాం..తెలుగుదేశం వారు అడ్డగోలుగా అవినీతి, దోపిడీ చేస్తూ ఉన్నారు. 

* చిన్నప్పుడు నేను నెల్లూరులో ఉండేటప్పుడు వెంకయ్య స్వామి అనే ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన పుస్తకాల్లో ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు చింతకాయల్లా రాలిపోతారు అని రాసారు. దోపిడీ చేసే వారిని ధర్మం చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చింతకాయల్లా రాలిపోతారు.

* నేను ధర్మాన్ని కాపాడడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ధర్మం ఒక్కొక్క సారి ఒక్కోలా కచ్చితంగా వుంటాది. 2014లో నేను తెలుగుదేశానికి మద్దతు తెలపడం అప్పటి ధర్మం, 2019లో వారిని దించెయ్యడం ఇప్పటి ధర్మం. 

* చినరాజప్ప గారు, యనమల గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, వైసీపీ నాయకులు మీరు చాలా అవినీతి చేస్తున్నారు జాగ్రత్త, మేము అన్నీ చూస్తున్నాం.. ఇష్టా రాజ్యంగా మూడు పంటలు పండే పచ్చని భూములను లాక్కున్నారు.

* ప్రభుత్వ పథకాలు అన్ని టిడిపి నాయకులు వారికి వస్తాయి ఇతరులకి రావు, ఇతర పార్టీ వారికి ఎటువంటి ప్రభుత్వ సహాయం ఉండదు అంటే వారిని ఏమనాలి

* సాక్షాత్తు ప్రతిపక్ష నేత అసెంబ్లీ వదిలేసి రోడ్లు పట్టుకుంటు తిరిగితే ఇంకెవరు ప్రజలకి అండగా నిలబడతారు, మరి రుణమాఫీ మీద ప్రభుత్వాన్ని నిలదీసేది ఎవరు

* జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగితే ఉపాధి అవకాశాలు కల్పించని ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు?

* 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా ఉన్నా కూడా ఉన్నపళంగా వదిలేసి ఎందుకు వచ్చారు.. ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ లో జరిగినట్టే అభివృద్ధి అంతా ఒకే చోట ఎందుకు చేయాలనుకుంటున్నారు?

* నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ఇప్పుడు 100 రకాల రూల్స్ పెడుతున్నారు, అందుకే అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని సరిగా వాడండి, మార్పు అదే వస్తుంది.

* నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క కులం అని అంటారు, కానీ సమాజంలో చెత్తను శుభ్రం చేసే రెల్లి కులస్తులను చూశాక, వారి బాధలను చూశాక నేను రెల్లి కులస్థుడ్ని అని చెప్పాను.

* రాబోయే కాలం అంతా కూడా సంకీర్ణ ప్రభుత్వాలే, 40 సీట్లు వచ్చిన వారు ముఖ్యమంత్రి అవుతారు కర్ణాటకలో లాగా, మొదటి సారి పోటీ చేసిన వ్యక్తి కేజ్రివాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇలా మార్పు అనేది దేశమంతా మొదలైంది.

* నేను జోస్యం చెబుతున్నాను వినండి, 2019 లో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు.. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు.. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

* మీరు చినరాజప్ప గారిని చూసి, లేక ఇంకెవరినైనా చూసి భయపడితే ఎప్పటికి మార్పు రాదు. కాబట్టి పోరాడితే పోయేదేమి లేదు వెదవ బానిస సంకెళ్లు తప్ప.. మీరు పోరాడండి మీకు నేను అండగా ఉంటాను.

* నేను నిన్న అక్రమంగా మైనింగ్ చేసిన వాడిని లఫుట్ అని అంటే డిబేట్లు పెట్టారు, ఏ బాలకృష్ణ గారు ప్రధానిని అమ్మ పేరుతో భూతులు తిడితే ఎందుకు మీరు డిబేట్లు పెట్టలేదు? ఏ పవన్ కళ్యాణ్ మాత్రం మెడ గోక్కున్న డిబేట్ పెడతారా? 

* ఏమైనా అంటే నిరుద్యోగ భృతి ఇస్తాం అంటారు. ఎవడికి కావలయ్యా మీ బోడి డబ్బు? ఉపాధి ఇవ్వండి మేమే ఉద్యోగాలు చేసుకొని మేమే సంపాదించుకుంటాం.

* ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు రావాలి, అంతే కాని సంవత్సరానికి 3,000 కోట్ల విలువైన మట్టి తవ్వుకుంటూ 40 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చే పరిశ్రమలు కాదు కావాల్సింది. 

* నేను ఒక సినిమా చేస్తే 150 మందికి పని దొరుకుతుంది, అలాంటిది 30 మంది ట్రక్కు డ్రైవర్లకు ఉపాధి ఇచ్చే అక్రమ మైనింగ్ ఎందుకు? 

* మహిళలు కుటుంబాన్ని పోషించేవారు, వారు జీవితాలు తీర్చిదిద్దే వారు.. అందుకే 33% రిజర్వేషన్లు ద్వారా రాజకీయ బాధ్యత మహిళలకు కల్పిస్తాం.

* వికలాంగులకు జనసేన మీరు కోరిన పింఛను ఇస్తుంది, మీరు తిరిగేందుకు వీల్ ఛైర్ ఇస్తాము, మీరు ఉండేందుకు ఇళ్లను కూడా నిర్మిస్తాము.

* అన్ని దశాబ్దాల నుంచి ఉన్న టీడీపీ ని, వేల కోట్లు ఉన్న జగన్ ని పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలడా అంటే!! కోడిగుడ్డుని పగలకొట్టడానికి బండరాయి కావాలా? చేయి చాలు.

* మార్పు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు, అలానే ఇప్పుడు అందరూ జనసేన వలన మార్పు వస్తుందా అని అంటున్నారు. చందమామ మీదకి వెళ్లగలిగిన వాళ్ళం, ఈ చిన్న వ్యవస్థను మార్చలేమా?

* రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన మనకు ఈ టీడీపీ ని కిందకు లాగలేమా? వైసీపీ ని వెనక్కి తొయ్యలేమా? మనం మార్పు సాధించలేమా? సాధించి తీరుతాము.

* భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోతే బాకీ పత్రం ఇస్తాను. ప్రభుత్వం నుంచి, మీకు అంచెలంచెలుగా డబ్బు చెల్లించేలా ఏర్పాటు చేస్తాను.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.