విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భాంతి
కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారని తెలుస్తోంది. విశాఖ – పలాస పాసింజర్, రాయగఢ్ రైలు ఢీ కొన్న ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ, రైల్వే శాఖ అధికారులను కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలి. దుర్ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో చీకటిగా ఉండటంతో సహాయక చర్యల్లో, మృతులను గుర్తించడంలో ఇబ్బంది కలుగుతోందని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది. కొద్ది నెలల కిందటే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలి. కంటకాపల్లి ప్రమాద స్థలంలో అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేన నాయకులకు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.