‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’తో దేశానికి దిక్సూచిగా ఏపీ: మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ/అమరావతి: ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్–2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫెయిత్ టూరిజం కాన్‌క్లేవ్–2026లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర పర్యాటక రంగంలోని అవకాశాలు, ప్రభుత్వ కార్యాచరణను జాతీయ వేదికపై వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, 283 బీచ్‌లు, తిరుమలతో పాటు 80 వేలకుపైగా ఆలయాలు, 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులు, దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం, విస్తారమైన బ్యాక్‌వాటర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, బౌద్ధ, వారసత్వ, ప్రకృతి, బీచ్, సాహస, ఆహార, కళా–చేనేత పర్యాటక రంగాల్లో రాష్ట్రానికి అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.

గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2023–24లో 28.58 కోట్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య 2025–26 నాటికి 36.42 కోట్లకు చేరిందని తెలిపారు. విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

రాష్ట్రంలో అమలవుతున్న నూతన పర్యాటక విధానం–2024–29 ద్వారా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు పెట్టుబడిదారులకు మూలధన సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, భూ మార్పిడి రుసుము మినహాయింపు, పారిశ్రామిక విద్యుత్ ధరలు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, సింగిల్ విండో అనుమతులు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.

అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టేలు, బీచ్ షాక్స్, ఫిల్మ్ టూరిజం, కాన్సర్ట్ పాలసీ, చారిత్రక కట్టడాల సంరక్షణ, పర్యావరణహిత పర్యాటకం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగం ద్వారా మూడు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిని ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆలయ, బౌద్ధ, ఎకో, బీచ్, నదీ, సీప్లేన్ పర్యాటక సర్క్యూట్లను విస్తరిస్తున్నామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని జీఐ గుర్తింపు పొందిన చేనేత, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులను పర్యాటక అనుభవంలో భాగం చేస్తున్నట్లు తెలిపారు.

మూడు అంతర్జాతీయ, మూడు దేశీయ విమానాశ్రయాలు, విస్తృత రైల్వే, జాతీయ రహదారి వ్యవస్థతో పాటు కృష్ణా, గోదావరి నదులపై రివర్ క్రూయిజ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏడాది పొడవునా పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక క్యాలెండర్ రూపొందించామని, ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ ప్రచారంలో భాగంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఆహార పర్యాటకం, అనుభవాత్మక పర్యాటకం, సమావేశాల పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులు భాగస్వామ్యాలు ఏర్పరచుకుని పెట్టుబడులు పెట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.