ప్రభుత్వ పాఠశాలకు స్థల విరాళం.. రాణెమ్మ దాతృత్వానికి ప్రశంసలు

పుంగనూరు: తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాలకు వంటగది నిర్మాణం కోసం స్థానిక నివాసి రాణెమ్మ తన సొంత స్థలాన్ని విరాళంగా అందించి ఉదారత చాటుకున్నారు. పాఠశాలలో వంటగది నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలిసి ఈ విషయాన్ని స్థానిక రాణెమ్మ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి తన సొంత స్థలాన్ని పాఠశాల అవసరాలకు అందించేందుకు ముందుకొచ్చారు.

సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల మార్కెట్ విలువ కలిగిన స్థలాన్ని పాఠశాలకు విరాళంగా ఇవ్వడంతో పాటు, కేవలం 15 రోజుల్లోనే అక్కడ వంటగది నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నూతనంగా నిర్మించిన వంటగదిని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు కుమార్ రాయల్ మాట్లాడుతూ, తనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేస్తూ రాణెమ్మ ప్రభుత్వ పాఠశాలకు విలువైన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. స్థలం ఇవ్వడమే కాకుండా వంటగది నిర్మించి ఇవ్వడం మరింత గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని, వారి సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

రాణెమ్మ మాట్లాడుతూ ప్రతి మనిషి తనకు ఉన్నదానిలో కొంతైనా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు. తన కుమార్తెలు సునీత, అనిత ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారని తెలిపారు. పాఠశాలతో తనకు ఉన్న అనుబంధం కారణంగానే ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రాణెమ్మ దాతృత్వాన్ని జనసేన నాయకులు కుమార్ రాయల్, ఎంఈఓ రెడ్డన్న శెట్టి, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించి సన్మానించారు.

కార్యక్రమంలో మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం, ఎస్జీటీ రమణ, పంచాయతీ సెక్రటరీ బి. నాగేంద్ర, టీడీపీ నాయకులు హేమంత్, రాజేష్, జనసేన నాయకుడు ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.