కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మహర్దశ: మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం: పెరవలి మండలం, కానూరు అగ్రహారం, కానూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. కానూరు అగ్రహారంలో రూ.20 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను, కానూరులో రూ.17 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో కానూరు అగ్రహారం గ్రామంలో రూ.4.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పల్లెపండుగ కార్యక్రమాల ద్వారా సీసీ రోడ్లు, రహదారులు, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యం, సీసీ డ్రెయిన్లు, హెల్త్ సెంటర్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

కానూరు గ్రామంలోనూ గత రెండేళ్లలో రూ.8.18 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, పల్లెపండుగ కింద రహదారులు, సీసీ డ్రెయిన్లు, గోకులం షెడ్లు, రహదారి నిర్మాణం, జెడ్పీ హైస్కూల్ కాంపౌండ్ వాల్, హెల్త్ సెంటర్ అభివృద్ధి వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు.

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రూ.27 కోట్లతో డి.ముప్పవరం నుంచి కాపవరం వరకు రహదారి నిర్మాణానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు రహదారిని పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరంలోని ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు. త్వరలో నూతన పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.