
ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పలువురు మంత్రులు హాజరయ్యారు.
గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రమాణ స్వీకారం అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మంత్రి మండలి, పీసీసీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, వారి అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు.