చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయండి.. జిల్లా కలెక్టర్ ఆదేశం

ఎర్రగొండపాలెం: భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెరువుల పూడికతీత పనులను యజ్ఞంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. గురువారం ఎర్రగొండపాలెం పట్టణంలో నిర్వహించిన జల ధార – జల హారతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి కాలువలు, చెక్ డ్యాములు, చెరువులను సాగుకు అనుకూలంగా మార్చుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులతో పాటు సాగునీటి సంఘాల అధ్యక్షులు, దాతలు ముందుకు రావాలని కోరారు.

జిల్లా మొత్తానికి 13 కోట్ల రూపాయలు నిధులు కేటాయించగా, ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గానికే 9 కోట్ల రూపాయలు కేటాయించడం ఈ ప్రాంత పరిస్థితిని తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు. మే నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయాలని అన్నారు. గత ప్రభుత్వం నీటి నిల్వ సంరక్షణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నియోజకవర్గంలోని 115 చెరువులను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్‌ఈ అబూతలిం తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.