
- డైరెక్టర్ కె విశ్వనాథన్ను సన్మానించిన ఏ.పి.యు.డబ్ల్యు.జె..ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర నేతలు
అమరావతి: సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ జర్నలిస్టుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
బుధవారం ఏ.పి.యు.డబ్ల్యు.జె ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ, కోశాధికారి ఏడుకొండలు డైరెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.
సమావేశంలో మాట్లాడిన డైరెక్టర్, జర్నలిస్టుల కోసం పలు కీలక అంశాలను వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చలు జరిపామని, త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.
జర్నలిస్టుల కోసం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వెటరన్ జర్నలిస్టులకు వారి జిల్లాల్లోనే బస్సు పాసులు జారీ చేసేలా ఆర్టీసీతో చర్చలు జరిగాయని వెల్లడించారు.
అక్రిడిటేషన్ల జారీ విషయంపై మాట్లాడుతూ, ఈసారి రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 2,700 మందికి పైగా రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు, 11,000 మందికి పైగా జిల్లా స్థాయి జర్నలిస్టులకు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నందుకు యూనియన్ నాయకులు డైరెక్టర్ విశ్వనాథన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.