

మద్దతు ధర లేక రైతు కుదేలు
* రబీలో అసాధారణంగా పెరిగిన సాగు
* రికార్డు స్థాయిలో దిగుబడులు
* క్వింటాకు రూ.700 నష్టపోతున్న కర్షకులు
రాష్ట్రంలో మొక్కజొన్న సాగు రబీలో గణనీయంగా పెరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా లేకుండా రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. రబీలోనే 12.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏపీలో సాధారణ విస్తీర్ణం 4.85 లక్షల ఎకరాలు కాగా, దేశ వ్యాప్తంగా రబీలో సాధారణం కంటే 11.76 శాతం సాగు విస్తీర్ణం పెరగ్గా, రాష్ట్రంలో ఏకంగా 156 శాతం మొక్కజొన్న సాగు పెరిగింది. దిగుబడులు కూడా భారీగా పెరిగాయి. ఎకరాకు కనిష్ఠంగా 32 నుంచి గరిష్ఠంగా 45 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి.
*ఏ జిల్లాలో ఎంత శాతం పెరిగింది?
కడప జిల్లాలో ఏకంగా 685 శాతం, కర్నూలు 531 శాతం, ప్రకాశం 473, నంద్యాల 426, పల్నాడు 371, అనంతపురం 326, ఎన్టీఆర్ 228, విజయనగరం 137, శ్రీకాకుళం 120, పార్వతీపురం మన్యం జిల్లాలో 117 శాతం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రబీలో సాధారణంగా 12 నుంచి 16 లక్షల టన్నులు రావాల్సి ఉండగా, ఏకంగా 40 లక్షల టన్నులకు చేరుకుంటున్నాయి. 2014లో 5.07 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 16 లక్షల టన్నుల దిగుబడి సాధించారు. 2025-26 రబీలో 12.55 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం చేరింది. 40 లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. తేమ శాతం 12 నుంచి 13 శాతం దాటకూడదు. మార్కెట్లోకి పెద్దఎత్తున మొక్కజొన్న రావడంతో వ్యాపారులు క్వింటాకు రూ.700 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఎకరాకు సగటున 32 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. అంటే రైతు ఎకరాకు రూ22,400 నష్టపోతున్నాడు. దేశ వ్యాప్తంగా కూడా మద్దతు ధర కన్నా సగటున 20 శాతం తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని కేంద్ర గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొక్కజొన్నకు మద్దతు ధర అందించాలని, నూరు శాతం సాయం చేయాలని సీఎం శ్రీ చంద్రబాబునాయుడు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
*అధిక విస్తీర్ణంలో సాగు చేసిన జిల్లాలు
రాయలసీమలోనూ రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. నంద్యాల జిల్లాలో 1.55 లక్షల ఎకరాలు, పల్నాడు జిల్లాలో 1.34 లక్షలు, బాపట్ల జిల్లాలో 1.20 లక్షలు, విజయనగరం జిల్లాలో 1.14 లక్షలు, కర్నూలు 1.01 లక్షలు, శ్రీకాకుళం 88 వేలు, అనంతపురం 84 వేలు, ప్రకాశం 80 వేలు, ఏలూరు 79 వేలు, గుంటూరు 70 వేలు, ఎన్టీఆర్ 50 వేలు, పార్వతీపురం మన్యం 30 వేలు, తూర్పుగోదావరి 27 వేలు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
* సాగు ఎందుకు పెరిగిందంటే?
మెట్ట పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా పత్తి, మిరప, కంది పంటలు సాగు చేసిన రైతులు ఐదేళ్లుగా తీవ్రంగా నష్టపోయారు. ఈ పంటలకు గిట్టుబాటు ధరలు దక్కక పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. గత ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించారు. గత ఏడాది మొక్కజొన్న క్వింటాకు రూ.2 వేలకు పైగా ధర దక్కింది. రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు లాభాలు సాధించారు. దీంతో రైతులు రబీలో మొక్కజొన్న సాగుకు ఆసక్తి చూపించారు. చాలా కాలంగా మొక్కజొన్నను పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ల దాణాగా ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇథనాల్ ఉత్పత్తి, బీర్లు తయారీలో కూడా విరివిగా వాడుతున్నారు.
*సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి
ఒకప్పుడు మొక్కజొన్న సాగు అంటే పెద్దగా పెట్టుబడి లేని పంట. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ సాగు ఖర్చులు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎకరా కౌలు రూ.30 వేలకు చేరింది. అధిక దిగుబడులు తీసేందుకు రైతులు ఎరువులు కుమ్మరిస్తున్నారు. కొందరు రైతులు ఏకంగా ఎకరాకు 15 బస్తాల ఎరువులు వేస్తున్నారు. సగటున రైతులు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల ఎరువులు వాడుతున్నారు. ఇక పురుగు మందులు కూడా విపరీతంగా పిచికారి చేయాల్సి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు పెరిగిపోయాయి.
*మద్దతు ధర కరవు
మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదు. గత ఏడాది గరిష్ఠంగా క్వింటా రూ.2300 ధర దక్కింది. క్రమంగా తగ్గి రూ.2100 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆరంభంలో క్వింటా రూ.2100 ధర పలికింది. తరవాత అది రూ.1700లకు పడిపోయింది. వాతావరణంలో మార్పులతో జల్లులు పడుతూ ఉండటంతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాగుఖర్చులు విపరీతంగా పెరగడం, దీనికితోడు కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో మొక్కజొన్న రైతు ఆందోళన చెందుతున్నాడు.