గిడుగు సేవా పురస్కారానికి నల్లా నరసింహమూర్తి, బి.వి.వి. సత్యనారాయణ ఎంపిక

అమలాపురం, ఆగస్టు 23: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ కవులు నల్లా నరసింహమూర్తి, బి.వి.వి. సత్యనారాయణ ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా సాహిత్య సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం తెలిపారు.

శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడిగా, కోనసీమ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడిగా బి.వి.వి. సత్యనారాయణ కొనసాగుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ తెలుగు భాష, సాహిత్య వికాసానికి విశేష కృషి చేస్తున్నారని ఈశ్వరీ భూషణం తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని, పలు పురస్కారాలు అందుకున్న వీరు నిరంతర రచనల ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు తెలుగు భాష పరిరక్షణకు కూడా వీరిద్దరూ అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.

సమాజ ఆరోగ్యం కోసం నల్లా నరసింహమూర్తి 117 నడక నానీల పుస్తకాలను రచించి ఉచితంగా పంపిణీ చేశారని ఈశ్వరీ భూషణం వెల్లడించారు. ఆయన 2026 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వీకరించారని తెలిపారు.

1979 నుంచి నల్లా నరసింహమూర్తి, బి.వి.వి. సత్యనారాయణ సాహిత్య, సాంస్కృతిక, తెలుగు భాషా పరిరక్షణ కోసం వేలాది సాహిత్య సభలను నిర్వహించడంతో పాటు సాహిత్య సంస్థల విస్తరణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పరిశోధనా పత్రాలు సమర్పించి పలు బహుమతులు అందుకున్నారని తెలిపారు.

సాహిత్య సేవను సామాజిక బాధ్యతగా స్వీకరించి నిరంతరం కృషి చేస్తున్నందుకు వీరిద్దరిని గిడుగు తెలుగు భాషా సాహిత్య సేవా పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఈశ్వరీ భూషణం వివరించారు.

గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న అమలాపురంలోని పరంజ్యోతి, మిరియం డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక సీఈవో కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ ఎస్పీ కొండా నరసింహారావు చేతుల మీదుగా నల్లా నరసింహమూర్తి, బి.వి.వి. సత్యనారాయణ పురస్కారాలు అందుకోనున్నారు.

పురస్కారానికి ఎంపిక చేసిన శ్రీశ్రీ కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణంకు పురస్కార గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.