నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆ భూములను తొలగించాలి: ప్రేమకుమార్

మేడ్చల్-మల్కాజిగిరి: కూకట్‌పల్లి మండలం హైదర్‌నగర్ గ్రామంలోని సర్వే నంబర్లు 145లోని 90 ఎకరాలు, 163లోని 14.26 ఎకరాల భూములను భూభారతి పోర్టల్‌లోని 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని కూకట్‌పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ, ఆయా సర్వే నంబర్ల భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ భూములకు సంబంధించిన వివాదం చాలా కాలం క్రితమే పరిష్కారమైందని, న్యాయపరంగా ప్రైవేట్ వ్యక్తుల హక్కులు ఖరారయ్యాయని పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వం కూడా ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తుల హక్కులను అంగీకరించిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మ్యూటేషన్ చేయాలని 2004లో మెమో నంబర్ 28908/JAI/2004-1తో పాటు 2006, 2008 సంవత్సరాల్లో మెమోలు జారీ అయ్యాయని, 2005లో B/7869/2001 నంబర్‌తో మ్యూటేషన్ ఆర్డర్ కూడా ఇచ్చారని వివరించారు. అలాగే 2006 నుంచి 2009 మధ్య ఈ భూములకు యూఎల్‌సీ క్రమబద్ధీకరణ జరిగినట్లు తెలిపారు.

1987, 1989లో హుడా నుంచి లేఅవుట్ అనుమతులు, జీహెచ్‌ఎంసీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌, భవన నిర్మాణ అనుమతులు పొందినట్లు ప్రేమకుమార్ పేర్కొన్నారు. 2004 నుంచి ఇటీవల వరకు ఈ భూములపై కొనుగోళ్లు, అమ్మకాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయని తెలిపారు.

వివాదం లేని ఈ భూములను ఇటీవల మళ్లీ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో నిజమైన యజమానులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించి ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో నిషేధిత ఆస్తుల జాబితా అంశంపై ప్రజల తరఫున జనసేన పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని ప్రేమకుమార్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.