మంగళగిరిలో ఆధునిక రైతు బజార్‌కు శంకుస్థాపన

మంగళగిరి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో నిర్మించనున్న మోడరన్ రైతు బజార్‌కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు.

5.90 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్‌ఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను నిర్మించనున్నారు. మొత్తం 71,925 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఆధునిక, పరిశుభ్రమైన, పర్యావరణహిత సౌకర్యాలు కల్పించనున్నారు.

రిటైల్ మార్కెట్‌లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు, ఇతర వస్తువుల కోసం 60 షాపులు ఏర్పాటు చేయనున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులు ఉండనున్నాయి. వీటితో పాటు కోల్డ్‌స్టోరేజీ, కూరగాయల శుభ్రపరిచే ప్రాంతం, పరిపాలనా విభాగాలు, క్యాంటీన్, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలను కల్పించనున్నారు.

ఈ సందర్భంగా ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు ఒకేచోట అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

కోల్డ్‌స్టోరేజీ, వెజిటబుల్ వాషింగ్ ఏరియా, ప్రత్యేక పార్కింగ్, క్యాంటీన్, పారిశుధ్య సదుపాయాలు, సౌర విద్యుత్, చెత్త సేకరణ వంటి ఆధునిక సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మించడం వల్ల రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మోడల్ రైతు బజార్ పూర్తయితే మంగళగిరితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ. భీముడు, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.