కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు లంక గ్రామాల ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు నుంచి లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిపిటివో షబ్నం పాల్గొని బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇటీవల రూ.7 కోట్లకు పైగా నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం మూడు లంక గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. బస్సు సౌకర్యం కల్పించినందుకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సుబ్రహ్మణ్యంకు లంక గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఏపీఎస్ఆర్టీసీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఏలూరు–కైకలూరు మధ్య నడిచే బస్సులు లంక గ్రామాలకు రాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యను ఆర్టీసీ బోర్డు సమావేశంలో చర్చించి, ఏలూరు నుంచి కైకలూరు లంక గ్రామాలకు బస్సు సర్వీస్ నడిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఏలూరు నుంచి పెద్ద ఎడ్లగాడు, పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక వరకు ఈ బస్సు సర్వీస్ కొనసాగుతుందని, తిరుగు ప్రయాణంలో మల్లి నందిగామలంక, పెనుమాకలంక, పెద్ద ఎడ్లగాడు మీదుగా ఏలూరు చేరుకుంటుందని తెలిపారు. నాలుగు లంక గ్రామాల ప్రజలకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, గ్రామస్థులు, అధికారులు కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా లంక గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, డిపిటివో షబ్నం, ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ వాణి, కైకలూరు జనసేన నాయకులు కొల్లు బాబీ, నాలుగు లంక గ్రామాల మాజీ సర్పంచులు, వైస్ సర్పంచులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.