హస్తకళల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన లేపాక్షి చైర్మన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీలో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల రంగ అభివృద్ధి, కళాకారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. లేపాక్షి ఆధ్వర్యంలో హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విస్తృత మార్కెట్ కల్పించేందుకు చేపడుతున్న చర్యలను హరిప్రసాద్ వివరించారు.

తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి హస్తకళల షోరూమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ప్రాంతాల్లో హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కళాకారుల ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ కల్పించవచ్చని వివరించారు. దీనివల్ల ఉత్పత్తుల విక్రయాలు పెరగడంతో పాటు కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

లేపాక్షి ద్వారా హస్తకళా ఉత్పత్తుల విక్రయాలను విస్తరించేందుకు ఈ-కామర్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సజీవ హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను లేపాక్షి వేదికగా మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థ వార్షిక ఆదాయాన్ని రెండు నుంచి మూడు రెట్లు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలోని అంగళ్లు వద్ద క్రాఫ్ట్ విలేజ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, సహకారం అందించాలని హరిప్రసాద్ కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా ఏటికొప్పాక, కొండపల్లి ప్రాంతాల్లో కూడా క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఆయా ప్రాంతాల్లో క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలించి, వాటి అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి సవిత ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళా రంగ అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని హరిప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంగళ్లు, ఏటికొప్పాక, కొండపల్లి ప్రాంతాల్లో క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

హస్తకళాకారులకు మెరుగైన ఉపాధి కల్పించడం, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందించడం, సంప్రదాయ హస్తకళలను పరిరక్షించడం లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా రంగ అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు హరిప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.