
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన సోషల్ మీడియా ఇంచార్జీ జనసేన రవి 11 రోజుల పాటు వారాహి దీక్ష చేపట్టారు. ఆదివారం దీక్షను విరమించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుతూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దీక్ష కాలంలో ప్రతిరోజూ శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా జనసేన రవి మాట్లాడుతూ, ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు అవసరమైన నాయకుడని పేర్కొన్నారు. భుజ నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను కొనసాగించిన ఆయన అంకితభావం అందరికీ ఆదర్శమని అన్నారు.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, మునుపటి కంటే మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ ఓంకార విశ్వేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారితో పాటు సర్వదేవతల ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రార్థించారు.