
మామిడికుదురు: మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుతోట ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న 30 KL సామర్థ్యమున్న వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్మాణ దశలోనే పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తయితే సుమారు 150 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పునఃప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 10వ తేదీలోపు నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.