
మంగళగిరి : జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత అవకాశం కల్పించడమే పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్తలు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సమాచార సేకరణ ప్రక్రియ నేపథ్యంలో సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ, జనసేన పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దేశానికి బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణాన్ని సామాన్య కార్యకర్తల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో ఈ సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ విధానం దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డా. పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ, “కేడర్ టూ లీడర్” కార్యక్రమం ద్వారా ఉద్యమకారులను నాయకులుగా తీర్చిదిద్దే చారిత్రాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త వివరాలను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించి, అందరి ఆమోదంతో బాధ్యతలు అప్పగించడం జనసేన పారదర్శక విధానానికి నిదర్శనమన్నారు. వ్యక్తులను వ్యవస్థలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని వివరించారు.
కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డా. బుర్రా దివ్యరాజ్ మాట్లాడుతూ, పార్టీ కోసం సేవలందించిన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశయమని పేర్కొన్నారు. రాజకీయంగా అండలేని వారికి జనసేన ఒక వేదికగా నిలుస్తోందని, రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోందన్నారు.
మరో కేంద్ర కార్యాలయ సమన్వయకర్త పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సమాచార సేకరణ కమిటీలు పూర్తిస్థాయి పారదర్శకతతో పనిచేస్తాయని చెప్పారు. కార్యకర్తల వివరాలను సమగ్రంగా పరిశీలించి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేసే ప్రక్రియకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సమాచార సేకరణ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ ప్రక్రియ ద్వారా పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని కేంద్ర కార్యాలయ సమన్వయకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.