
మంగళగిరి: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుధవారం మంగళగిరిలో సందడి చేశారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీతో పాటు పాల్గొంటున్న జట్ల జెర్సీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్, ఏపీఎల్ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే అద్భుత వేదికగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కొత్త క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించడంలో ఇలాంటి లీగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
రామ్ చరణ్ రాకతో స్టేడియం ప్రాంగణం సందడిగా మారింది. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమం అనంతరం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి సానా సతీశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎల్ లీగ్ దశ పోటీలు జూన్ 27 వరకు కొనసాగనున్నాయి. అనంతరం ప్లేఆఫ్స్ నిర్వహించి, జూన్ 30న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో భీమవరం బుల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.