
విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రెండుసార్లు కాపాడిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు దశాబ్దాలుగా పోరాడారని గుర్తు చేసిన లోకేష్, కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైసీపీ తన గత వైఖరిని గుర్తు చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పేరుతో స్టీల్ ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అలాగే కాలుష్యం పేరుతో కర్మాగారం భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే చర్యలు తీసుకోవడంతో కార్మికుల జీవితాలు ఆందోళనకు గురయ్యాయని వ్యాఖ్యానించారు.
ఇటీవల స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించడం మానవత్వంతో కూడిన చర్యేనని, అయితే అలాంటి విషాద ఘటనలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని లోకేష్ అన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేసిన వారే ఇప్పుడు కార్మికుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అంశంలో గతంలో తీసుకున్న నిర్ణయాలపై జగన్ కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.