తెలంగాణ ఎవరి జాగీర్ కాదు.. అది నా మాతృభూమి: పవన్ కళ్యాణ్

తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీర్ కాదని, అది తన మాతృభూమి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉండటం, అక్కడికి రావడం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం తన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కొందరు చిన్నచితకా రాజకీయ శక్తులు తన రాకను, రాజకీయ కార్యకలాపాలను ప్రశ్నించడం సరికాదని విమర్శించారు.

బుధవారం ఢిల్లీలో ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై స్పందించారు. తెలంగాణకు రావడానికి తనకు పూర్తి హక్కు ఉందని, ఎవరూ తనను మాతృభూమి నుంచి దూరంగా ఉండాలని చెప్పలేరని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు తనను బయటి వ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

తాను సర్జరీ నుంచి కోలుకుంటున్న సమయంలో కూడా కొందరు వ్యక్తులు “హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నావు, ఇది నీ గడ్డ కాదు” అంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. అలాంటి వారిలో కాంగ్రెస్ మద్దతుదారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎవరి జాగీర్ కాదని, అది తన మాతృభూమి అని స్పష్టం చేయాల్సి వచ్చిందన్నారు.

తెలంగాణకు రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, తాను ఎక్కడ ఉండాలో, ఎక్కడ రాజకీయాలు చేయాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. ప్రాంతీయ భావజాలంతో వ్యక్తులను విభజించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.