డీజిల్ కొరతపై ఆందోళన అవసరం లేదు: జె.సి వైఖోమనిధియా దేవి

అమలాపురం: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ వైఖోమనిధియా దేవి స్పష్టం చేశారు. ఈనెల 27 ఉదయానికి జిల్లాకు ఆయిల్ సరఫరా చేరుతుందని, రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె జిల్లాలోని వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 పెట్రోల్ బంకులు ఉన్నాయని, పెట్రోలు, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం పెట్రోలు 778.7 కిలోలీటర్లు, డీజిల్ 497.6 కిలోలీటర్లు నిల్వ ఉన్నట్లు తెలిపారు. వచ్చే వారానికి అవసరమైన ఇంధన పరిమాణం కూడా అంచనా వేయబడిందని వెల్లడించారు.

కొంతమంది డీలర్లు కావాలనే స్టాక్ ఉన్నప్పటికీ లేనట్లు చెప్పి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరిగితే 6ఏ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

వ్యవసాయ పనులు, ఆక్వా రంగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా డీజిల్ సరఫరా నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బంకులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.

ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఫిర్యాదులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఇంధన సరఫరా త్వరలో పూర్తిగా సాధారణ స్థితికి చేరుతుందని ఆమె హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.