గిద్దలూరులో పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంక్‌కు భూమిపూజ

గిద్దలూరు: మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు.

ఈ బంక్ పోలీస్ వాహనాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని, నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ వాహనాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుందని తెలిపారు.

విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఇంధనం అత్యవసరమని, ఈ బంక్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అన్నారు. నిర్మాణ పనులు సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు. నాగరాజు, గిద్దలూరు టౌన్ సీఐ సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున రావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.