డంపింగ్ యార్డు తరలింపు కోసం కలెక్టరేట్ ముట్టడి

శృంగవరపుకోట: కొత్తవలస రాజన్న కాలనీలో డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద వరుసగా మూడవ సోమవారం భారీ ఆందోళన నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి జరిగిన ఈ నిరసనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాజన్న కాలనీ పక్కన చెత్త డంపింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళనకారులు తెలిపారు. గత మూడు వారాలుగా గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ రమాసుందర రెడ్డి సానుకూలంగా స్పందించి, మంగళవారం నుండి చెత్త వేయకూడదని ఆదేశాలు ఇచ్చినా, అవి క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ, అవసరమైతే ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాజన్న కాలనీ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

డంపింగ్ యార్డు తరలింపు జరగకపోతే ప్రత్యక్షంగా చెత్త తరలింపును అడ్డుకుంటామని, జరిగే పరిణామాలకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో స్థానికులు, మహిళలు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.