
5 నగరాల్లో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు
* రూ.59.63 కోట్లతో ప్రణాళిక
* వ్యర్థాల సమస్యకూ పరిష్కారం
* కూటమి ప్రభుత్వ ముందుచూపు
ఇంట్లో ఆర్థిక సమస్య ఎదురైతే, కుటుంబ సభ్యులందరూ ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరి పరిధిలో వాళ్లు పొదుపు చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆదర్శవంతంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి ఓ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదర్శ కుటుంబంలో బాధ్యత కలిగిన సభ్యుడిలాగా వంట గ్యాస్ కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాల కేసి దృష్టి సారించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రాష్ట్రంలో ఐదు చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసి వాణిజ్య అవసరాలకు సరఫరా చేయనుంది. పలు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల తరహాలో రాష్ట్రంలో ఒంగోలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడలలో రూ.59.63 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రూ.12.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌గా లభిస్తుంది. రూ.8.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. పుర, నగరపాలక సంస్థలు రూ.17 కోట్లు అందిస్తాయి. మిగిలిన రూ.21.83 కోట్లు ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రైవేట్ సంస్థలు పెట్టనున్నాయి. ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది.
* ఉత్పత్తి ఎలా?
బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తి చేయడానికి పొడి చెత్తను ఉపయోగించనున్నారు. అలా ఒకో ప్లాంట్లకు రోజుకు 25 టన్నుల పొడి చెత్త అవసరం ఉంటుంది. ఆ లెక్కన రాష్ట్రంలో నెలకొల్పనున్న అయిదు ప్లాంట్లకు కలిసి మొత్తం 125 టన్నుల వ్యర్థాలు అవసరం. ఇందుకోసం నగరాల్లో మార్కెట్‌లు, హాస్టళ్లు, హోటళ్లు, కమ్యూనిటీ హాళ్ల నుంచి ఆహారం, కూరగాయల వ్యర్థాలను రోజూ తరలించనున్నారు. టౌన్‌షిప్‌లు, భారీ అపార్ట్‌మెంట్ల నుంచి కూడా సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం, ‘ఘన వ్యర్థాల నిర్వహణ విధానం-2026’ కొత్త నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. వాటి ప్రకారం రోజూ వంద కిలోల పొడి వ్యర్థాలు వచ్చే టౌన్‌షిప్‌లలో వాటిని ఎరువుల కింద విధిగా తయారు చేయాలి. లేనప్పుడు నగరపాలక సంస్థలకైనా సరఫరా చేయాలి. అందువల్ల ఇలాంటి వాటి నుంచి కూడా రోజూ పొడి వ్యర్థాలు ప్లాంట్లకు తరలించనున్నారు.
* ఉత్పత్తి ఎంత?
రోజూ 125 టన్నుల వ్యర్థాలు వినియోగించేలా రాష్ట్రంలో నెలకొల్పే ఐదు ప్లాంట్లలో ఐదు టన్నుల బయో గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. ప్రాథమిక దశలో హోటళ్లకు, రెండో దశలో ఇతర వాణిజ్య సంస్థలకు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్లాంట్లు 132 ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 120 టన్నుల గ్యాస్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోనూ దశలవారీగా ప్లాంట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ ప్లాంట్లను ప్రోత్సహించనుంది. స్వచ్ఛ కార్యక్రమాల్లో ఇదో కీలక ముందడుగు.
* ప్రయోజనాలు ఏంటి?
ఇలాంటి ప్లాంట్ల వల్ల నగరాల్లో వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎక్కడికక్కడ డంపింగ్ యార్డులలో పేరుకుపోయే చెత్త నిర్వహణ సులువవుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తి వల్ల ఎల్‌పీజీ వినియోగం తగ్గుతుంది. తద్వారా కొరత తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా కొంత మేరకు ఆదా అవుతుంది. స్థానికంగా ప్రత్యమ్నాయ ఇంధన ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా విదేశాల నుంచి సరఫరా అయ్యే గ్యాస్ పై ఆధారపడే అగత్యం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వివిధ సరుకుల ధరలు కూడా పెరగకుండా ముఖ్యంగా ప్రజాధనం ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘సతత్ పథకం’ కింద నిధులను ఈ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం ద్వారా సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.