
తాడిపత్రిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం నుంచి గాంధీ కట్ట సర్కిల్, నవరం టాక్స్ రోడ్, గాంధీ సర్కిల్, వాల్మీకి సర్కిల్ మార్గంగా టౌన్ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎస్ఐ గౌస్‌కు ఫిర్యాదు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని దూషిస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని హిందూ ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించిందని తెలిపారు.
తాడిపత్రి శాంతియుత వాతావరణానికి నిలయమైందని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవతలపై, ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ప్రతి భక్తుడు స్పందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.