

* ఆదర్శ రైతు ప్రయోగాత్మక సాగు విజయవంతం
*ఎకరాకు టన్ను దిగుబడి
* లక్షన్నర ఆదాయం
ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ తో పనిలేదు అంటారు. అంటే ప్రతి ఒక్కరు తినదగిన పండు యాపిల్. మన దేశంలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. ఇంత వరకు దక్షిణ భారత దేశంలో యాపిల్ పండించిన దాఖలాలు పెద్దగా లేవు. దక్షిణాది రాష్ట్రాలు ఈ పంటకు అనుకూలం కాదు. కాని అనంతపురం రైతు శ్రీ రమణారెడ్డి చేసిన ప్రయోగం ఇప్పుడు, రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఉష్ట్రోగ్రతలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో కూడా పండించే రకాలను ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు. రెండున్నర ఎకరాల్లో యాపిల్ సాగు చేసి మంచి దిగుబడులు తీసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన విజయం ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోంది.
అనంతపురం జిల్లా దేశంలోనే రెండో అత్యంత కరవు ప్రాంతం. రాజస్థాన్‌లోని జైసల్మేర్ తరవాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. ఈ ప్రాంతంలో పంటలు పండించడమే పెద్ద సవాల్. అయితే రైతు శ్రీ రమణారెడ్డి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చీరల వ్యాపారంలో వచ్చిన లాభాలతో శ్రీ రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల్లో 13 ఎకరాలు కొనుగోలు చేశారు. 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, మూడుకరాల్లో ఖర్జూర సాగు చేసి విజయం సాధించారు. మంచి లాభాలు గడించారు. అప్పుడే యాపిల్ సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. యాపిల్ మొక్కలు నాటారు. మొదట సరిగా దిగుబడులు రాలేదు. అయినా వెనక్కు తగ్గలేదు. అధిక ఉష్ట్రోగ్రతలు తట్టుకుని దిగుబడులిచ్చే రకాలు ఇజ్రాయెల్ దేశంలో దొరుకుతాయని యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ లో వున్న అతని స్నేహితుడి ద్వారా 2024 అక్టోబరులో 1500 యాపిల్ మొక్కలు తెప్పించి రెండున్నర ఎకరాల్లో సాగు చేశారు. ఏడాది తరవాత పూత, పిందెలు వచ్చాయి. ఒక్కో మొక్కకు 130 నుంచి 150 పిందెలు వుంచి మిగిలినవి తొలగించారు. దీంతో కాయలు బలంగా వచ్చాయి. తొలి పంట ద్వారా ఎకరాకు ఒక టన్ను యాపిల్ దిగుబడి సాధించారు. కేజీ రూ.150 నుంచి రూ.170కు అమ్మడం ద్వారా సగటున ఎకరాకు లక్షన్నర ఆదాయం వచ్చింది.
*ఉద్యానశాఖ అధికారుల భరోసా
అతి శీతల ప్రదేశాలు, ముఖ్యంగా విపరీతంగా మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే యాపిల్ పంట దిగుబడులు ఇస్తుంది. అయితే అనంతపురం జిల్లా కుందుర్పి, గార్లదిన్నె, పెద్దపప్పూరుకు చెందిన ముగ్గురు రైతులు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకుని మంచి దిగుబడులు ఇచ్చే లోచిల్లీ డెలిషియస్ అంటే కె.యల్.డి. రకాలను పండించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. వారిలో కోటంకా గ్రామానికి చెందిన శ్రీ రమణారెడ్డి ఒకరు. ఆయన సాగు చేసిన విధానం రైతులకు దిక్సూచిగా నిలుస్తోంది.
రెండేళ్ల కిందట అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే కేయల్‌డి యాపిల్ రకాల మొక్కలను ఇజ్రాయెల్ నుంచి ఒక్కో మొక్క రూ.280కు కొనుగోలు చేశారు. మొక్కలు నాటిన తరవాత పశువుల ఎరువులు, యారియా, పొటాష్, ఫాస్సేట్, కాంప్లెక్స్ ఎరువులు వినియోగించారు. తెగుళ్లు, కీటకాలు కాయలను నాశనం చేయకుండా వాటికి కవర్లు తొడిగారు. ఉద్యానశాఖ అధికారుల సలహాలు తీసుకుని అమలు చేశారు. మొదటి పంట దిగుబడి కొంత తక్కువగా వున్నా, తరవాత దిగుబడులు కాయ సైజు పెరుగుతుందని ఉద్యానశాఖ సంచాలకులు శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
ఇటీవల జలధార కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు శ్రీ రమణారెడ్డి ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. తాను పండించిన యాపిల్ బాక్సులు ప్రదర్శించారు. సీఎం శ్రీ చంద్రబాబు నాయుడుకు అనంత యాపిల్ గిఫ్ట్ ప్యాక్ అందించారు. ఏపీలో యాపిల్ సాగుపై పరిశోధనలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతు శ్రీ రమణారెడ్డి ప్రయోగాలను సీఎం కొనియాడారు.
*చల్లని మన్యంలో ఎప్పటి నుంచో….
గతంలో విశాఖ ఏజన్సీ ప్రాంతాల్లోనూ ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టారు. చింతపల్లి జీకే వీధి మండలంలో

యాపిల్ మంచి దిగుబడులు అందించింది. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. వేసివిలోనూ చల్లగా వుంటుంది. ఆంధ్రా కశ్మీరుగా పేరున్న లంబసింగిలోనూ యాపిల్ సాగు సత్ఫలితాలు ఇచ్చింది. దమనపల్లి, మడెం గిరిజన గ్రామాల్లోనూ రెండు యాపిల్ రకాలు మంచి దిగుబడులు అందించాయి. పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఉద్యానశాఖ అధికారులు ఈ ప్రాంతానికి అనువైన మొక్కలను ఉచితంగా అందించారు. కొందరు రైతులను ముందుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. వారితో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు విస్తరిస్తున్నారు. ఈ ప్రాంతంలో పండే కాయ 350 నుంచి 400 గ్రాముల వరకూ వస్తోందని ఐటీడీఏ అధికారి తెలిపారు. మడెం గిరిజన ప్రాంతంలో సాగు చేసిన యాపిల్ మొక్కలకు 30 నుంచి 34 కాయలు వచ్చాయి. రుచి కూడా అద్భుతంగా వుండటంతో సాగును 200 ఎకరాలకు పెంచాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.