రహదారుల నిర్మాణంపై…. అభివృద్ధి గిట్టనివాళ్లు తప్పుడు ప్రచారాలు

 నాణ్యతా ప్రమాణాల పరీక్షల కోసం కట్ చేస్తే.. రోడ్డు దెబ్బతిన్నట్టు దుష్ప్రచారం
• ఇది అభివృద్ధిని చూసి ఓర్వలేనితనమే
• కూటమి ప్రభుత్వం నాణ్యత విషయంలో కచ్చితమైన ప్రమాణాలు అమలు చేస్తోంది
• తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
• ⁠దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడడం లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంతో బాధ్యతగా రహదారుల తనిఖీలు, సోషల్ ఆడిట్ లు పక్కాగా నిర్వహిస్తూ, అత్యంత పారదర్శకంగా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. సోషల్ ఆడిట్ ప్రక్రియను అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. అంత పారదర్శకంగా ఉండబట్టే సోషల్ ఆడిట్ విభాగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో రాష్ట్రం నిలిచింది. గత రెండు రోజులుగా – అభివృద్ధి గిట్టని వాళ్ళు తమ అనుకూల మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలను ప్రచారం చేసి, వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారు. సదరు వ్యక్తులు, సంస్థలు చూపుతున్న రోడ్డులోని భాగాలు నిర్మాణ లోపాల వల్ల దెబ్బ తిని కాదు. నాణ్యతా తనిఖీలలో భాగంగా కట్ చేసిన రోడ్డు భాగం అని గమనించగలరు. నాణ్యతా ప్రమాణాల పరీక్షలో తొలుత మొదటి పొరను పరిశీలించేందుకు టెస్ట్ కట్ చేస్తారు. అది పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలు అందుకుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి పొర నిర్మాణం చేపడతారు. రోడ్డు తుది మెరుగులు దిద్దుకునే వరకు బలాన్ని, మన్నికను, దీర్ఘకాలిక పని తీరుని నిర్ధారించే విధంగా ఈ తనిఖీలు నిర్వహిస్తారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వీడియోలు – నిర్మాణంలో ఉన్న ప్రత్తిపాడు రోడ్డుకు సంబంధించినవి. నాణ్యతా పరీక్షల నిమిత్తం కట్ చేసిన వాటిని రోడ్డు దెబ్బ తిన్నట్లు చూపడం ప్రజల్ని తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించాలి. అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు, వాళ్లకు అనుకూలంగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలు – జరుగుతున్న అభివృద్ధిని గుర్తించడం మాని, ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారాలు చేస్తున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, వారి దురుద్దేశాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంస్థల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. రోడ్లతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, 100 శాతం సోషల్ ఆడిట్ లు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేర్చింది. ఇది రాష్ట్రంలో సాగుతున్న సమర్ధమైన పాలనకు నిదర్శనం. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.