బియ్యం బస్తాలపై రైతుల వివరాలు.. ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం

రైతుల గౌరవాన్ని పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి బియ్యం బస్తాపై QR కోడ్ ముద్రించి, ఆ పంటను ఎవరు పండించారు, ఎక్కడ పండించారు అనే వివరాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

నెల్లూరు కలెక్టరేట్‌లో వరి కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పండించిన బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల పాఠశాలలు, 400 పైగా సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయనున్నారు. బియ్యం బస్తాలపై ఉన్న QR కోడ్ ద్వారా విద్యార్థులు తాము తినే ఆహారం పండించిన రైతుల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాలోనే 75 వేల టన్నుల వరి సేకరణ పూర్తయిందని, ఈ సీజన్‌లో 2 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మిల్లర్లను మంత్రి ఆదేశించారు. రవాణా వాహనాలు, గన్నీ బ్యాగుల కొరత వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.