మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేనలోకి ఆహ్వానిస్తున్నాం

• జనసేనలో చేరేవారు జన సైనికులను ముందుంచి, ఐక్యతతో పని చేయాలి
• ఎచ్చెర్లలో వైసీపీ నుంచి జనసేనలో చేరినవారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు

మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, జనసేనలో చేరేవారు ఎవరైనా సరే జనసైనికులను, వీరమహిళలను ముందుంచి ఐక్యతతో పని చేయాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూటమి సమన్వయ కమిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని, జనసేన నుంచి పోటీ చేసే వారి విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అంతిమ నిర్ణయమని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం సిగడం మండలానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, నీటిసంఘాల అధ్యక్షులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ కె. నాగబాబు గారు జనసేన పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో పీఏసీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ప్రస్తుత సర్పంచ్ శ్రీ తిరుమరెడ్డి గౌరీశంకర్, శ్రీ మక్కా సాయిబాబు నాయుడు-తూర్పుకాపు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీమతి బత్తుల స్వాతి-సర్పంచ్, శ్రీ టెంకల రామకృష్ణ-సర్పంచ్, శ్రీ ఎర్రబోలు సింహాచలం-సర్పంచ్, శ్రీ రౌతు నారాయణ రావు-ఎంపీటీసీ, శ్రీ కోమర్ల సామయ్య-ఎంపీటీసీ, శ్రీ గొరుసుపూడి నారాయణరావు-ఉప సర్పంచ్, శ్రీ ఇనపకుర్తి అప్పలదాసు-ఉపసర్పంచ్, శ్రీ కోనల సత్యనారాయణ-ఉపసర్పంచ్, శ్రీ ఎర్రబోలు అన్నారావు-మాజీ సర్పంచ్, శ్రీ అంకం జగన్నాథం-మాజీసర్పంచ్, శ్రీ బత్తుల వెంకట కృష్ణారావు-మాజీ సర్పంచ్, శ్రీ యాసర్ల శివ-మాజీ ఎంపీటీసీ, శ్రీ కాకర్ల నీలకంఠం-మాజీ ఎంపీటీసీ, శ్రీ దుర్గాసాయి రామారావు-ఎంపీటీసీగా పోటీచేసిన అభ్యర్థి తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడుతూ.. వైసీపీ దాష్టికాలను తట్టుకోలేక, వైసీపీలో ఇమడలేక ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారని, చాలామంది జనసేనలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరిని పడితే వారిని జనసేనలో చేర్చుకోకుండా, శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సామినేని ఉదయభాను, శ్రీ కిలారి రోశయ్య వంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. అపజయాలు ఎన్నో చూశామని, ఒక్క విజయంతో పొంగి పోయే వాళ్ళం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జనసేన ఎప్పుడూ ప్రజాపక్షమేనని వెల్లడించారు. అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా గౌరవిస్తామని అన్నారు. 14ఏళ్ల పాటు కార్యకర్తగా పనిచేసిన అనుభవంతో కార్యకర్తల మనోభావాలు బాగా తెలుసునని, కార్యకర్తల మనోభావాలకు భంగం వాటిల్లకుండా, జనసేన పార్టీని బలోపేతం చేసుకునే లక్ష్యంతో పని చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ తాలాబత్తుల పైడిరాజు, శ్రీ వడ్డాది శ్రీనివాసరావు, సిగడం మండలం ఉపాధ్యక్షులు శ్రీ పొగిరి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
• వైసీపీ సర్పంచుల గౌరవాన్ని చంపేస్తే, జనసేన సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తోంది -జనసేనలో చేరిక సందర్భంగా సర్పంచులు
ప్రజాక్షేత్రంలో సర్పంచులుగా ఎన్నికై, ప్రజాసేవ చేయాలి అనుకున్న సర్పంచుల గౌరవాన్ని వైసీపీ చంపేస్తే, జనసేన సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తోందని జనసేనలో చేరిక సందర్భంగా సర్పంచులు స్పష్టం చేశారు. వాలంటీర్లకు ఇచ్చిన విలువ కూడా సర్పంచులకు ఇవ్వలేదని వాపోయారు. గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇచ్చిన నిధులను వైసీపీ నాయకులు దోచుకున్నారని అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ వ్యవస్థను అభివృద్ధిని చేస్తున్న విధానాన్ని చూసి జనసేనలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.