సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

మార్కాపురం: మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేస్తున్న సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి వెంబడి పుల్లమ్మ డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలపై మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెంట్రల్ కిచెన్ విధానం వల్ల విద్యార్థులకు చల్లారిన ఆహారం అందే ప్రమాదం ఉండటంతో పాటు పోషక విలువలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ విధానం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 88,596 మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించడంతో పాటు సబ్సిడీపై వంట గ్యాస్ అందించాలని, పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పందిటి మోహన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏఐటీయూసీ నాయకుడు నాసర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.