
రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ (APTA) మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య అధికారిక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా 2026 సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ (ఎఫ్‌ఏసీ) ఎ.ఎ.ఎల్. పద్మావతి, ఐఏటీఓ జాతీయ అధ్యక్షుడు రవి గోసేన్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హిల్ స్టేషన్లు వంటి అపారమైన పర్యాటక వనరులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయని, ఈ సదస్సు ద్వారా రాష్ట్ర పర్యాటక సామర్థ్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందుతుందని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, ట్రావెల్ ప్రొఫెషనల్స్, పర్యాటక పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బిజినెస్ సెషన్లు, పర్యాటక ప్రదర్శనలు, బిజినెస్-టు-బిజినెస్ సమావేశాలు, డెస్టినేషన్ ప్రెజెంటేషన్లు, పరిశ్రమ చర్చలు, ఫ్యామ్ టూర్లు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవి రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలను తీసుకువస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటక భాగస్వాములను ప్రోత్సహించేందుకు ఐఏటీఓ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజును 50 శాతం తగ్గించి రూ.6,000 ప్లస్ జీఎస్టీ స్థానంలో రూ.3,000 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది. అలాగే కొత్త సభ్యత్వాల కోసం రూ.10,000 ప్లస్ జీఎస్టీ వన్‌టైమ్ జాయినింగ్ ఫీజును 2026 డిసెంబర్ 31 వరకు పూర్తిగా మినహాయించింది.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చి, జాతీయ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఐఏటీఓ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఈ సదస్సును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.