మామిడికుదురులో అంగన్వాడీ టీచర్లకు ఏఐ ఆధారిత శిక్షణ

మామిడికుదురు : ఐసీడీఎస్ పి. గన్నవరం ప్రాజెక్టు పరిధిలోని మామిడికుదురు మండలంలో అంగన్వాడీ టీచర్లకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి అధ్యక్షత వహించగా, మండల అభివృద్ధి అధికారి భవాని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి విజయశ్రీ మాట్లాడుతూ, 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల్లో ఆరోగ్య, పోషకాహార మరియు అభివృద్ధి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎత్తు, బరువు, రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదలలో సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యాలను ట్యాబ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా నమోదు చేసి తక్షణమే గుర్తించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు.

ఈ సాంకేతిక విధానం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన వైద్య సేవలను చిన్నారులకు సకాలంలో అందించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.

అనంతరం మామిడికుదురు మెయిన్ సూపర్వైజర్లు బి. అన్నపూర్ణ, ఎన్. సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలే గ్రామీణ ప్రాంత చిన్నారుల తొలి ఆరోగ్య కేంద్రాలని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే వేలాది మంది చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రామలక్ష్మి, బి. అన్నపూర్ణ, ఎన్. సుబ్బలక్ష్మి, వివిధ సెక్టార్లకు చెందిన అంగన్వాడీ టీచర్లు పాల్గొని ఏఐ ఆధారిత ఆరోగ్య గుర్తింపు విధానాలపై శిక్షణ పొందారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.