నిడదవోలు రైతులకు సాగునీటి భరోసా.. పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా నీటి విడుదల

నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గ రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెండ్యాల పంప్ స్కీమ్ మోటారును స్విచ్ ఆన్ చేసి సాగునీటిని కాలువల్లోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా 13 గ్రామాల పరిధిలోని దాదాపు 7 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో నాట్లు వేసి మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఇప్పటికే ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు.

ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో రైతులు ముంపు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

నిడదవోలు పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గమని, జిల్లాలో అత్యధిక వరి సాగు జరిగే ప్రాంతాల్లో ఇదొకటని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నీటి సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. సకాలంలో సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, త్వరలోనే నాట్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నిడదవోలు ఆయకట్టుకు జలసిరి చేరడంతో రైతాంగంలో ఆనందం వెల్లివిరిసింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.