

* టీఎంసీకి తగ్గుతున్న జనాదరణతో బలపడుతున్న బీజేపీ
* ‘సర్’ సవరణలతో ముస్లిం ప్రాంతాల్లో తృణమూల్‌కు తీవ్ర నష్టం
* దీదీ సర్కార్ ముస్లింల బుజ్జగింపుతో మెజారిటీ హిందువులు బీజేపీ వైపే మొగ్గు
* ఎస్సీ, ఎస్టీల్లో అత్యధిక జనం మద్దతు కాషాయపక్షానికే
* కాంగ్రెస్, వామపక్షాలకు మరోసారి పరాభవం తప్పదంటున్న పరిశీలకులు
దాదాపు 34 ఏళ్ల వామపక్షాల పాలనకు 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వస్తి పలికిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి 2026 ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. ‘దీదీ’ మమత తన పదిహేనేళ్ల పరిపాలనలో చేసిన అకృత్యాలే నేడు గుదిబండగా ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ నెల 23, 29 తేదీల్లో పోలింగ్ జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 18వ ఎన్నికల్లో పాలకపక్షం తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీఎంసీ లేదా

టీఎంసీ), ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. వామపక్షాల సుదీర్ఘ పాలనలో కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తల జులుం, రాజకీయ హింస, రాష్ట్రంలో ఆర్థిక వెనుకబాటు, నిరుద్యోగం, ప్రజల భూములను పరిశ్రమల కోసం బలవంతంగా సర్కారు లాక్కోవడం వంటి కారణాలతో 2011లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ సర్కారు గతంలో లెఫ్ట్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించిన సీపీఎం (మార్క్సిస్టులు) చేసిన తప్పులనే తీవ్ర స్థాయిలో చేస్తూ రాష్ట్రంలో ఇప్పుడు జనాదరణ గణనీయంగా కోల్పోతోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయే పరిస్థితులు పైకి ఇంకా కనిపించనప్పటికీ రాష్ట్ర ప్రజల మద్దతుతో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ అనూహ్యంగా పుంజుకుని బలపడుతోందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓట్లతో కేవలం మూడే మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రజలను అంచనాలకు అందని రీతిలో ఆకట్టుకుంటూ ఐదు సంవత్సరాల్లో బలీయ శక్తిగా ఆవిర్భవించింది. మమత ముస్లింల బుజ్జగింపు విధానాలు మెజారిటీ హిందువులను బీజేపీకి దగ్గరయ్యేలా చేస్తున్నాయి. ఫలితంగా 2021 ఎన్నికల్లో బీజేపీ బలం అసెంబ్లీలో 77 సీట్లకు పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులు (ఎస్సీలు), ఆదివాసీల (ఎస్టీలు) మద్దతు భారీ స్థాయిలో సంపాదిస్తూ రాష్ట్రంలోని మొత్తం 65 శాతం ఉన్న హిందువుల హృదయాలను అచిరకాలంలో గెలుచుని అధికారం దిశగా పరుగులు తీస్తోంది బీజేపీ. కాషాయపక్షం ఇదే తీరున ముందుకు సాగితే మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్‌లో మెజారిటీకి అవసరమైన 148 స్థానాలు కైవసం చేసుకోవడం కష్టమేమీ కాదని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. మసకబారుతున్న సర్కారు, పార్టీ ప్రతిష్ఠ చివరికి మమతను అధికారం కోల్పోయేలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
*తృణమూల్ జనాదరణ కోల్పోవడానికి అనేక కారణాలు
‘రాజకీయ కాళీ మాత’గా, ‘ఫైర్‌బ్రాండ్’ నేతగా, ‘నియంత సీఎం’గా పేరు సంపాదించిన ‘దీదీ’ (అక్క) మమతా బెనర్జీ రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని ఉక్కు పిడికిలితో నడుపుతున్నారు. పాలనలో తన బద్ధ శత్రువులైన మార్క్సిస్టుల పద్ధతులను అనుసరించడం వల్ల తొలి పది సంవత్సరాల్లో తృణమూల్ పాలకపక్షంగా బలపడుతున్నట్టు కనిపించింది. చివరికి ఈ పంథాయే మమత కొంప ముంచేలా ఉంది. ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను తన పార్టీలో చేర్చుకోవడం, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలపై పెత్తనం చేసే అసాంఘిక శక్తులను బెదరించి వారిని సొంత పార్టీ సైనికులుగా మార్చి వాడుకోవడం వంటి చర్యలు ఆమె పార్టీకి మేలు కన్నా కీడు ఎక్కువ చేశాయి. దీనికితోడు టీచర్ల నియామకాలు, పరిపాలనలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడం, ఇలాంటి కుంభకోణాలతో సంబంధం ఉన్న తృణమూల్ మంత్రులు, నేతల తరఫున ప్రభుత్వం గట్టిగా నిలబడడం వల్ల గతంలో మచ్చలేని నాయకురాలిగా ఉన్న మమత ఇమేజ్ బాగా మసకబారింది. వేలాది మంది ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌లో లంచాలు తీసుకోవడం, శారదా గ్రూపు వంటి అనేక కంపెనీల నుంచి పార్టీకి ముడుపులు తీసుకోవడంతోపాటు, అవి అడ్డగోలుగా చేసిన కుంభకోణాలను మమత సర్కారు సహించడం వంటి అనేక అప్రతిష్ఠకర చేష్టలు 2021 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బలం 2016 నాటి మూడు సీట్ల నుంచి 77కు పెరగడానికి దోహదం చేశాయి. అయితే, రాష్ట్రంలో 33 శాతం వరకూ ఉన్న ముస్లింలను తన ఎత్తుగడలు, వ్యూహాలు, సంక్షేమ పథకాల ద్వారా తృణమూల్ ఆకట్టుకోవడం ఇప్పుడు ఆమె పతనానికి దారితీసేలా ఉంది. గతంలో టీఎంసీ విజయంలో కీలకపాత్ర పోషించిన మైనారిటీలను బుజ్జగించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం, ఇతర ఎన్నికల వ్యూహాల కారణంగా కిందటి ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన రీతిలో తన బలాన్ని 211 నుంచి స్వల్పంగా 215 సీట్లకు మమతా బెనర్జీ పెంచగలిగారు. వామపక్షాలు, కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకున్న ముస్లింల పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్) ఒకే ఒక సీటు గెల్చుకుంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ 48.02% ఓట్లతో 215 సీట్లు సాధించింది. బీజేపీ 38.15% ఓట్లతో 77 స్థానాలు గెల్చుకుంది. లెఫ్ట్‌ఫ్రంట్‌కు నాయకత్వం వహించిన సీపీఎం దాదాపు ఐదు శాతం ఓట్లతో కుప్పకూలిపోయింది.
*కాంగ్రెస్‌లో ‘దీదీ’ మూలాలు– సోమనాథ్ చటర్జీని ఓడించిన ఘనత
ఇరవై ఏళ్లు నిండకుండానే 1970ల్లో కాంగ్రెస్‌లో చేరిన మమత ఎమర్జెన్సీ ముందు 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనపై ఉద్యమాలు నడిపిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కారుపై కోలోకతాలో నాట్యం చేసి నిరసన తెలపడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె 1984 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీపై జాదవ్‌పూర్ స్థానంలో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2004లో సోమనాథ్ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. తర్వాత ఆమె 1989 పార్లమెంటు ఎన్నికల్లో అదే స్థానంలో సీపీఎం అభ్యర్థి మాలినీ భట్టాచార్య చేతిలో ఓడిపోయారు. అయితే, 1991 నుంచి 1996 వరకూ కాంగ్రెస్ తరఫున పార్లమెంటుకు ఎన్నికై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ స్థాపించి మాతృసంస్థ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన మమత నాటి ఏబీ వాజపేయి మంత్రివర్గాల్లో సభ్యురాలిగా కొన్నేళ్లు ఉన్నారు. 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో చేరి కొంత కాలం నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
*కాంగ్రెస్‌తో పొత్తుతో 2011 ఎన్నికల్లో విజయం–దక్కిన సీఎం పదవి
పశ్చిమ బెంగాల్ మార్క్సిస్టు ప్రభుత్వాలపై సుదీర్ఘ పోరాటం చేసిన మమతకు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను ఓడించి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చే అవకాశం లభించింది. ఈ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఘన విజయం సాధించారు. మొత్తం 294 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 స్థానాలు అవసరం. దీదీ ముఖ్యమంత్రి కావడానికి దారితీసిన ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ టీఎంసీ 184 సీట్లు కైవసం చేసుకుంది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 42 స్థానాలు లభించాయి. వామపక్ష కూటమికి నాయకత్వం వహించే సీపీఎం 37.13% ఓట్లతో కేవలం 40 సీట్లు దక్కించుకుంది. తృణమూల్‌కు ఈ ఎన్నికల్లో విడిగా 38.93% ఓట్లు లభించాయి. 2016 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని ఒకట్రెండు చిన్న పార్టీల పొత్తుతో పోటీచేసింది. ఈ ఎన్నికల్లో తృణమూల్ బలం దాదాపు 45% ఓట్లతో 211 సీట్లకు పెరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు వంటి బోగస్ ఓటర్లు, ప్రతిపక్షాలపై దౌర్జన్యం, ఎన్నికల్లో చెప్పనలవి కాని అక్రమాల ద్వారా మమత పార్టీ బలం గణనీయంగా అసెంబ్లీలో పెరిగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని మహాకూటమి (మహాజోత్)లో చేరి దెబ్బతింది గాని 42 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. సీపీఎం 30% ఓట్లతో కేవలం 26 సీట్లు దక్కించుకుంది. వామపక్ష కూటమిలోని ఇతర పార్టీలైన సీపీఐకి ఒక సీటు, ఫార్వర్డ్ బ్లాక్‌కు 2, ఆర్‌ఎస్పీకి 3 స్థానాలు మాత్రమే దక్కాయి. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు చిన్నాచితకా పార్టీలతో కలిసి పోటీచేసి కేవలం 3 సీట్లు దక్కించుకుంది. అయితే, ఈ పార్టీకి పది శాతానికి పైగా ఓట్లు లభించాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు మూడేళ్లపాటు బీజేపీ ఎడతెగని రాజకీయ పోరాటం చేయడం ద్వారా సీట్లతోపాటు ఓట్ల శాతాన్ని పది నుంచి 38 శాతానికి పైగా పెంచుకోగలిగింది. తృణమూల్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగిపోయింది బీజేపీ. బెంగాల్‌లో కాషాయపక్షం అధికారం హస్తగతం చేసుకోవడానికి ఇక ఎంతో కాలం పట్టదని కిందటి ఎన్నికల్లో నిరూపించుకుంది. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందు జరిపిన స్వతంత్ర సర్వేలు, బీజేపీ అంతర్గత ఎన్నికల సర్వేలు రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారని సూచించడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌లో 15 రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారని వార్తలొచ్చాయి.
*ముస్లిం ఓటర్లు పాతిక శాతానికి పైగా ఉన్న నియోజకవర్గాల్లో తృణమూల్‌దే హవా!
బెంగాల్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగినప్పటి నుంచీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లింలు పాలకపక్షాన్ని నిర్ణయించే స్థితిలో ఉన్నారు. మొదట వారిని ఆకట్టుకున్న కాంగ్రెస్ నేతలు, తర్వాత కమ్యూనిస్టులు అధికారంలో ఎక్కువ కాలం ఉన్నారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1977 వరకూ బెంగాల్‌ను పరిపాలించింది. 1967, 1969 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మిత్రపక్షాల సాయంతో గెలిచిన కమ్యూనిస్టులు మొత్తంమీద మూడు సంవత్సరాలు సంకీర్ణ సర్కార్లతో పరిపాలించారు. బీజేపీ ప్రచారం చేసే జాతీయవాదం, హిందూ సాంస్కృతిక వైభవం పునరుద్ధరణ వంటి అంశాల కారణంగా మమత విధానాలతో అసంతృప్తితో ఉన్న మెజారిటీ హిందువులు బీజేపీకి దగ్గరవుతున్నారు. ముస్లింలకు తన అడ్డగోలు విధానాల ద్వారా తృణమూల్ సర్కారు వంత పాడుతోంది. అన్ని మతాల ప్రజలను సమానంగా చూడాలనే లౌకిక సూత్రానికి మమత తిలోదకాలు ఇచ్చారు. ఫలితంగా హిందువుల మద్దతుతో బీజేపీ అజేయశక్తిగా అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో మమతకు అత్యంత విధేయత గల ఓటు బ్యాంక్‌గా ముస్లింలు మారిపోవడం తృణమూల్ సర్కారుకు నష్టదాయకంగా పరిణమించింది. రాష్ట్రంలో హిందువులు 65%, ముస్లింలు 33 శాతం ఉన్నారని అంచనా. 2021 ఎన్నికలపై రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు శుభాశీస్ మొయిత్రా పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో హిందువులు 90 శాతానికి పైగా ఉన్న 49 నియోజకవర్గాల్లో కిందటిసారి తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 20 స్థానాలు కైవసం చేసుకుంది. ముస్లిం ఓటర్లు 25%కి పైగా ఉన్న 146 సీట్లలో తృణమూల్ 131 స్థానాలు కైవసం చేసుకుంది. ముస్లింలు మమత పార్టీకి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నారో ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామమే పదిహేనేళ్ల పాలన తర్వాత మమతను అధికారం నుంచి దూరం చేస్తుందా అనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మమత సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక్కటే తృణమూల్‌కు ఏకైక అనుకూలాంశం.
*కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ఎవరికి వారే
కిందటి ఎన్నికల్లో కలిసి పోటీచేసిన సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు, కాంగ్రెస్ ఈసారి విడివిడిగా పోటీచేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ అధీర్ రంజన్ చౌధరీ నాయకత్వంలోని కాంగ్రెస్ దాదాపు అన్ని సీట్లకూ అభ్యర్ధులను నిలబెట్టింది. ముస్లింల పార్టీ ఐఎస్‌ఎఫ్‌తో లెఫ్ట్ ఫ్రంట్‌కు పొత్తు కుదరలేదు. మీనాక్షీ ముఖర్జీ వంటి యువ సీపీఎం నేతలు బెంగాలీ ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ కమ్యూనిస్టులకు సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంలో ఉన్న పాత పద్ధతుల కారణంగా అనేక మంది యువ నేతలు ఇటీవల తృణమూల్‌లో చేరడం లెఫ్ట్ ఫ్రంట్‌కు పెద్ద దెబ్బ. రాష్ట్ర సీపీఎం కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్ సలీం మంచి వక్తేగాని, ఆయనకు జనాకర్షణ శక్తి లేదు. అనేక మంది సీనియర్లు వృద్ధాప్యం కారణంగా ప్రచారం చేసే స్థితిలో లేరు. వామపక్షాల 34 ఏళ్ల పరిపాలనలోని అవలక్షణాలను, అవాంఛనీయ అనుభవాలను ప్రజలు ఏ మాత్రం మర్చిపోలేదు. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో వామపక్షాలు స్వల్పంగానైనా కోలుకునే అవకాశాలు కానరావడం లేదు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ ముర్షీదాబాద్ జిల్లా బహ్రంపూర్ నుంచి, మరో మాజీ ఎంపీ మౌసమ్ మీర్ మాల్దా జిల్లా మాలతీపూర్ నుంచి ఈసారి పోటీచేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ రెండు స్థానాలేనని రాజకీయ పండితులు చమత్కరిస్తున్నారు.
*2021లో నందిగ్రామ్–ఇప్పుడు భవానీపూర్
2021 ఎన్నికల్లో తన పూర్వ మంత్రివర్గ సహచరుడు, బీజేపీ నేత సువేందు అధికారీ బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో పోటీచేసి ఆయన చేతిలో మమత ఓడిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. సీఎంగా ప్రమాణం చేశాక ఆమె తన సొంత పాత నియోజకవర్గం భవానీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె భవానీపూర్ నుంచి మాత్రమే పోటీచేస్తున్నారు. అయితే, సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే గాక భవానీపూర్‌లో తన పూర్వ నాయకురాలు మమతా బెనర్జీతో తలపడుతున్నారు. ఫలితంగా ప్రజల దృష్టి ఇప్పుడు భవానీపూర్‌పై కేంద్రీకృతమైంది.
*2016 ఎన్నికల నుంచి ఎదుగుతున్న బీజేపీ
2016 అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం ఓట్లు సాధించి దూకుడు పెంచిన బీజేపీ రాష్ట్రంలో వేగంగా బలపడుతోంది. అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిపిన విస్తృత ఓటర్ల జాబితాల సవరణ (సర్) ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై ఉంటుందని అంటున్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బోగస్ ఓటర్ల పేర్లు తొలగించారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు వలసపోయిన ఓటర్ల తొలగింపు కార్యక్రమం పకడ్బందీగా జరగింది. ఇలాంటి ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో అక్రమంగా సాధించిన ఓట్లతో తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40.6% ఓట్లతో 18 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి ఎప్పుడు అధికారంలోకి వస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 2026 ఎన్నికల్లో కొంత మొగ్గు తృణమూల్ వైపు ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాని, మే 4న జరిగే ఓట్ల లెక్కింపు వరకూ తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుందనడంలో సందేహం లేదు. మమత సర్కారు విధానాలు మైనారిటీలకు ఎక్కువ అనుకూలంగా ఉండడంతో మెజారిటీ హిందువులు బీజేపీ వైపు చూడడం కాషాయపక్షం ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెల్చుకోవడానికి దోహదం చేస్తుంది. తమను తృణమూల్ సర్కారు విస్మరిస్తోందని, తమ ప్రయోజనాలు దానికి పట్టడం లేదని అత్యధిక హిందువులు నొచ్చుకోవడం బీజేపీ మరింత బలోపేతం కావడానికి ప్రధాన కారణం. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి వస్తున్న అక్రమ చొరబాటుదారులపై బీజేపీ కేంద్ర సర్కారు ఉక్కుపాదం మోపడం కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత అనుకూల అంశం.