రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి స్వీకరించే దరఖాస్తు (బయో డేటా) నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) ఆమోదం తెలియచేసింది.

ఈరోజు ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి అధ్యక్షతన విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పి.ఎ.సి. సమావేశమైంది. దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన చేసే స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులో ఎటువంటి వివరాలు పొందుపర్చాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు లాంటి అంశాలపై పి.ఎ.సి. చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేశారు. దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాలని స్క్రీనింగ్ కమిటీకి పి.ఏ.సి. సూచించింది. స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియచేసింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ మాదాసు గంగాధరం, శ్రీ రావెల కిషోర్ బాబు, శ్రీ పి.బాలరాజు, శ్రీ ఎం.రాఘవయ్య, శ్రీ అర్హం ఖాన్, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్, పార్టీ అధ్యక్షుల రాజకీయ సలహాదారు శ్రీ పి.రామ్మోహన్ రావు, పి.ఎ.సి. సభ్యురాలు శ్రీమతి సుజాత పాండా, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.
నిబద్ధత ఉన్న అభ్యర్థుల్ని నిర్ణయిస్తాం: శ్రీ పవన్ కల్యాణ్ గారు
2019 జనరల్ ఎలక్షన్‌లో లోక్‌సభ, అసెంబ్లీలకు జనసేన పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్ధులు వారికి సంబంధించి బయోడేటాలను శ్రీ మాదాసు గంగాధరం గారి నేతృత్వంలో ఏర్పడిన స్క్రీనింగ్ కమిటీకి సమర్పించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభ్యర్ధుల బయోడేటాల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన ఆయన, తొలిగా తన బయోడేటాని స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. ఇప్పటి నుంచి బయోడేటాల స్వీకరణ ప్రక్రియ మొదలైనట్టు తెలిపారు. 2009 అనుభవాల దృష్ట్యా డబ్బు అనే అంశానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా, నిబద్దత, కష్టపడేతత్వాన్ని బట్టి అభ్యర్ధుల్ని నిర్ణయించడం జరుగుతుందనీ, ఇందులో ఎలాంటి అవకతవకలు ఉండవని చెప్పారు. అభ్యర్ధులు కూడా పక్క మార్గాలకు వెళ్లకుండా బయోడేటాను నేరుగా కమిటీకి ఇవ్వాలనీ, పరిశీలనాధికారం ఒక్క కమిటీకి మాత్రమే ఉందనీ స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీకి బలమైన నిర్దేశిత సూత్రాలు ఇచ్చానని, అందుకు అనుగుణంగానే పరిశీలన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జనసేన అభ్యర్ధులు బయోడేటాలు సమర్పించేందుకు ఈ ఐదుగురు సభ్యుల కమిటీ మాత్రమే ఉంది. దయచేసి వారికే బయోడేటాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. శాసనసభ, లోక్ సభకు పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్గదర్శకాలు సూచించారు. ఆ మార్గదర్శకాలకి అనుగుణంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తాం. స్క్రీనింగ్ కమిటీపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన బాధ్యతలను చిత్తశుద్ధితో, వారి నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తాం. ఇవాళ్టి నుంచే స్కీనింగ్ కమిటీ బయోడేటాలు తీసుకోవడం మొదలు పెట్టింది. మొదటి అభ్యర్ధిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి దరఖాస్తును స్వీకరించాం. అభ్యర్ధులు బయోడేటాను తీసుకునే అధికారం ఈ కమిటీ సభ్యులకు మాత్రమే ఉంది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆశావహుల బయోడేటా ఫార్మ్స్ అందుబాటులో ఉంటాయని, అక్కడే వివరాలు పూర్తిచేసి అందించవచ్చని, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని తెలిపారు.