నేపాల్ వరదలపై ఐదు నెలల ముందే హెచ్చరిక

నేపాల్‌ను ఇటీవల అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలపై ఐదు నెలల ముందే ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ వరదల్లో 272 మంది మృతి చెందగా, హిందూకుష్ హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని ఖాట్మండు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన రెండు నివేదికల్లో హెచ్చరించింది.

ICIMOD నివేదిక ప్రకారం.. 2000 సంవత్సరం నుంచి హిందూకుష్ హిమాలయాల్లో మంచు కరిగే వేగం రెట్టింపైంది. 1975 నుంచి ఇప్పటివరకు దాదాపు 27 మీటర్ల మందంతో కూడిన మంచు పొర కరిగిపోయింది. 1990-2020 మధ్య కాలంలో ఈ ప్రాంతంలోని హిమానీనదాలు తమ మొత్తం విస్తీర్ణంలో 12 శాతం, మంచు నిల్వల్లో 9 శాతం కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉందని, ఈ పరిణామాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం కష్టసాధ్యమని నిపుణులు హెచ్చరించారు.

నేపాల్‌లో సంభవించిన తాజా వరదలకు ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు కీలక కారణాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో మంచు మాత్రమే కురిసే 4,000 మీటర్ల ఎత్తైన ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వేగంగా మంచు కరగడం, ఎత్తైన ప్రాంతాల నుంచి మంచు, రాళ్ల చరియలు విరిగిపడి నదుల్లో కలవడం వంటి పరిణామాలు ఆకస్మిక వరదలకు కారణమై ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ మార్పుల కారణంగా మంచు కరిగిపోవడంతో పాటు నేల వేడెక్కుతోందని, దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం మరింత పెరుగుతోందని ICIMOD నిపుణుడు మహ్మద్ ఫరూక్ అజమ్ పేర్కొన్నారు.

ధ్రువ ప్రాంతాల తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంచు నిల్వలు హిమాలయాల్లో ఉన్నాయి. అందుకే వీటిని “ఆసియా వాటర్ టవర్స్”గా పిలుస్తారు. హిమాలయాల నుంచి ప్రవహించే 10 ప్రధాన నదీ వ్యవస్థలపై సుమారు రెండు బిలియన్ల మంది ప్రజలు తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో మరింత తీవ్రమైన ప్రభావాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.