
* గ్రేట్ గ్రీన్ వాల్ రెండో అంచెలో తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు
* తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం
* 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యం
* సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి గింజలు సేకరించిన అటవీ శాఖ
* తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు
సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గ్రేట్ గ్రీన్ వాల్ సంకల్పంలో కీలకమైన తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యింది. తాటి కాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రకృతి విపత్తుల సమయంలో గాలి నిరోధక వ్యవస్థగా తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పించనున్నాయి. మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు ప్రక్రియలో తాటి వనాల ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉప్పు నీరు, హోరు గాలులతో ఉండే తీర ప్రాంతాల కఠిన వాతావరణ పరిస్థితులకు తాటి చెట్టు అత్యంత అనుకూలమైన వృక్ష జాతి. ఉప్పు నేలలు, ఇసుక, బుసకతో కూడిన తీర ప్రాంత ఒండ్రు నేలల్లో సైతం పెరిగే సామర్థ్యం తాటి చెట్టుకు ఉంది. ఎత్తుగా పెరిగే జాతి కావడంతో బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా పని చేస్తుంది. అంతే కాదు బలమైన తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉండడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుంది. పక్షులు, కొన్ని రకాల సరిసృపాలకు ఆవాసంగా ఉండే తాటి చెట్లు జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉంటాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తట్టుకోగల శక్తి తాటి చెట్టు సొంతం. అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళికల్లో మొదటి అంచె మడ అడవులకు, రెండో అంచె తాటి వనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో తాటి వనాల ఏర్పాటును లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రతిపాదించారు. అందుకు దాదాపు 55 లక్షల తాటి గింజలు అవసరం అవుతాయని అటవీ శాఖ భావిస్తోంది. ఈ ఏడాది తాటి కాయల సీజన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రజలు, వివిధ వ్యవస్థల భాగస్వామ్యంతో 13 లక్షల తాటి గింజలు సేకరించారు. ఇప్పటికే 1 లక్ష 65 వేల తాటి గింజలను పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, స్కూలు విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో నాటే ప్రక్రియను రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఈ సీజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
తాటి గింజల సేకరణ, నాటడం, తాటి మొక్కల పెంపకం వంటి అంశాల్లో రాష్ట్ర అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు. మొలకెత్తే తాటి మొక్కల స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని, మొలకెత్తిన మొక్కల పైకి పశువులను తోలడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సహజ సంపదను కాపాడుకునే చర్యల్లో అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాల వెంబడి అనుకూల ప్రదేశాల్లో శాస్త్రీయ పద్ధతిలో తాటి గింజలు నాటాలని పేర్కొన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్తోపాటు 50 శాతం గ్రీన్ కవర్, పర్యావరణ పునరుద్ధరణ, రాష్ట్రంలో సహజ వనరుల పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.