
నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
పెరవలి మండలంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘చిన్నా’ నాయకత్వంలో బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నిరంతరం ప్రజాసేవ చేస్తూ ‘సేవకు రారాజు’గా గుర్తింపు పొందిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాల సాధనలో లయన్స్, రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో లయన్స్ క్లబ్‌కు అనుబంధంగా ఉన్న లియో క్లబ్‌లో సభ్యుడిగా చేరి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు లయన్స్ క్లబ్ మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు.
పెరవలి ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పూర్వ అధ్యక్షులు ‘రాయుడు’ కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు. స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పెరవలి ప్రాంతంలో లయన్స్ క్లబ్ చేపట్టే అన్ని సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
పుట్టలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
అనంతరం నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో శ్రీ పుట్టలమ్మ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వాతి హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నిడదవోలు కార్యాలయం వీధిలో నూతనంగా నిర్మించనున్న స్వాతి హాస్పిటల్ భవనానికి మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యానికి సూచించారు.