
అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరు శివారు వ్యాఘ్రస్వరం, కముజువారిపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ రామాలయంలో నిర్వహించిన ప్రధమ ఏకాహ మహోత్సవంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక మహోత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడటంతో పాటు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.