
మంగళగిరి పట్టణానికి చెందిన కొక్కుల హేమ వర్షిని చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) ఫైనల్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రెండు గ్రూపులు ఉత్తీర్ణత సాధించి సీఏ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకుని APMSIDC ఛైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆమెను ఘనంగా సత్కరించారు.
మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హేమ వర్షినికి శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తొలి ప్రయత్నంలోనే సీఏ కోర్సును పూర్తి చేయడం హేమ వర్షిని ప్రతిభ, కృషి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. స్వర్ణకారుడిగా కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి కష్టాలను దగ్గరగా చూస్తూ కూడా తన లక్ష్యాన్ని సాధించడం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు విజయానికి అడ్డంకులు కావని హేమ వర్షిని నిరూపించిందని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, మంగళగిరి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, స్థానిక శాసనసభ్యుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ యువత నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.
అనంతరం హేమ వర్షిని, ఆమె తల్లిదండ్రులు ఈ సత్కారానికి ఆనందం వ్యక్తం చేస్తూ చిల్లపల్లి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.