
విద్యార్థులకు విద్య పట్ల మక్కువ పెరగాలంటే పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన వాతావరణం ఎంతో అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై ఖోమ్ నైడియా దేవి పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం సంక్షేమ హాస్టళ్లలో నెట్ జీరో ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాలుష్యాన్ని తగ్గించడం, భూగర్భ జలాల సంరక్షణను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలో ఎంపిక చేసిన 11 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ఎనర్జీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఎంపిక చేసిన హాస్టళ్లతో పాటు ఇతర సంక్షేమ వసతి గృహాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని కోరారు.
సోలార్ ఎనర్జీ వినియోగం, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, పండ్ల మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయాలని సంక్షేమ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ హాస్టళ్ల ఆవరణలో విస్తృతంగా పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్–7 ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ ఈ నెల నుంచి మే 2027 వరకు కొనసాగుతుందని, రెండో దశ మరో ఏడాది పాటు ఉంటుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 1000 వసతి గృహాలను ఎంపిక చేయగా, కోనసీమ జిల్లాకు 11 హాస్టళ్లు కేటాయించినట్లు చెప్పారు.
హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు కే. గౌరీశంకర్, కృష్ణ, అంజలి ప్రత్యూష పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నెట్ జీరో ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు, పర్యావరణహిత చర్యలపై వివరాలు అందించారు.
విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందిస్తూ, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వసతి వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి పి. జ్యోతిలక్ష్మిదేవి, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, సంబంధిత సంక్షేమ హాస్టళ్ల అధికారులు పాల్గొన్నారు.