
అమరావతి: వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లో కలుషిత జలాల సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఇటీవల రాజమహేంద్రవరంలో రెండు రోజుల పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా పడవలో నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“పుష్కరాలకు వచ్చే భక్తులు మురుగునీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్న అనుభూతి కలగాలి” అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కమిటీ నిర్మాణం
ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
కమిటీలో పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్యశాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా-గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్‌తో పాటు గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
ప్రధాన లక్ష్యం
ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై గోదావరితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి ఎక్కడి నుంచి కాలుష్యం చేరుతోందో క్షేత్రస్థాయిలో గుర్తిస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టి వాటి అమలును పర్యవేక్షిస్తుంది.
గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నదీజలాలను అందించడమే ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.