హార్ముజ్ జలసంధిపై ఇరాన్ షరతులు – అమెరికా ససేమిరా

అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందుకు వచ్చినప్పటికీ, కొన్ని కీలక షరతులు పెట్టింది. ఒమన్, పాకిస్థాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో పంపిన ఈ ప్రతిపాదనలో ఇరాన్ రెండు ప్రధాన డిమాండ్లు ఉంచింది—అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం, అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయడం. ఈ షరతులకు అంగీకరిస్తే వాణిజ్య రవాణాకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ తెలిపింది.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో అణు చర్చలను వాయిదా వేయాలన్న షరతును అంగీకరించే అవకాశం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వెల్లడించారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్నా, హర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన ఈ మార్గం నిలిచిపోవడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు ఎరువులు, ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడుతోంది.

గల్ఫ్ దేశాలు కూడా ఈ మార్గంపై ఆధారపడటంతో సమస్య మరింత తీవ్రమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుండగా, ఇరుపక్షాలు తమ వైఖరిని మార్చకపోవడంతో పరిస్థితి ప్రతిష్టంభనలోనే కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.