
• స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు
• ఫలితాన్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రణాళికలు
• గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం
• రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లోనూ నంబర్ వన్ స్థానం
• సంస్కరణలతో వ్యవస్థల బలోపేతం
• పారదర్శక విధానాలతో పల్లెల్లో అభివృద్ధి వెలుగులు
• పల్లె ప్రగతే పంచాయతీరాజ్ దినోత్సవానికి అసలైన నిదర్శనం అంటున్న ప్రజలు
స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి… స్వయం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి… పల్లెలు జాతీయ సమగ్రత, సుస్థిరతకు మూల కేంద్రాలు కావాలి… ఇవీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించుకున్న లక్ష్యాలు. గత ప్రభుత్వ విధానాలతో పూర్తిగా నిర్వీర్యం అయిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తూ, ప్రతి అడుగులో పారదర్శకతతో కూడిన పాలన, సరికొత్త సంస్కరణలు అమలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 22 నెలల కాలంలో ఆ దిశగా ఎన్నో అడుగులు ముందుకు వేశారు. గ్రామీణ పాలనలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక దశకు చేరువయ్యింది. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (PR&RD) ప్రతి అడుగులో అపూర్వ విజయాలు అందుకుంటోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 24వ స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. రెండేళ్లలో సాధించిన అద్భుతం ఇది.
• గ్రామ సభలు చారిత్రాత్మక ఘట్టం
పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మౌలిక సదుపాయాలు కల్పన, పారదర్శకతతో కూడిన పాలన, గ్రామాల బలోపేతంపై దృష్టి సారిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 2024 ఆగస్టు 23వ తేదీన ఒకే రోజు 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికార్డు అందుకుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాల ద్వారా రూ.4,500 కోట్ల ఉపాధి హామీ పనుల ప్రణాళికకు రూపకల్పన చేశారు. గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి దశగా అడుగులు వేశారు.
• ఉద్యోగులకు పదోన్నతుల ఉత్సాహం
స్తబ్దతతో కూడిన పాలనా వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. అత్యంత పారదర్శకతతో చేపట్టిన ఆ ఘట్టం రాష్ట్ర పంచాయతీరాజ్ చరిత్రలో మరపురాని ఘట్టంగా మన్ననలు అందుకుంది. ఈ పదోన్నతులు పొందిన వారిలో పీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంపీడీఓలు, డీడీఓలు, జెడ్పీ సీఈవోలు ఉన్నారు. దీని ద్వారా ఉద్యోగస్తులు నిర్లిప్తత వీడి సమర్థవంతంగా విధులు నిర్వహించేలా చేశారు.
• మౌలిక వసతులు, గ్రామీణ అనుసంధానం
గిరి శిఖర గ్రామాలకు బాటలు వేసిన “అడవి తల్లి బాట”, పల్లెపండుగ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల పండుగ జరిగింది. రూ. 3,853 కోట్లు వెచ్చించి 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1,331 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించారు. రూ. 1,005 కోట్లు వెచ్చించి 625 గిరిజన ఆవాసాలను కలుపుతూ 1,049 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్లు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరంగా మారాయి. ఎన్నో గిరిజన గ్రామాలు డోలీ రహితంగా మారాయి.
• వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ సంకల్పం
గ్రామీణ పారిశుధ్య నిర్వహణలో మ్యాజిక్ డ్రెయిన్స్, స్వచ్ఛ రథాల ద్వారా విప్లవాత్మక అడుగులు వేశారు. ఈ రెండు వినూత్న కార్యక్రమాలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. మురుగును మాయం చేసి, భూగర్భ జలాలను పెంపొందించే మ్యాజిక్ డ్రెయిన్ల ద్వారా సాధారణ సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే సుమారు 80 శాతం ఖర్చు ఆదా అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 625 స్వచ్ఛ రథాలు పొడి చెత్త సేకరణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆదాయాన్ని అందిస్తోంది.
• గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం ద్వారా పాడి రైతుకి అండగా నిలిచారు. ఫారం పాండ్స్ నిర్మించి రైతుకి దిగుబడి సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 375 కోట్లు కేటాయించి 21,567 గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 15,000 నీటి తొట్టెలు, 1,06,788 ఫారం పాండ్స్ నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
• డిజిటల్ పాలనతో పారదర్శకత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మస్టర్ల అవకతవకలకు చెక్ పెడుతూ సాంకేతికత సాయంతో ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ తీసుకువచ్చారు. స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా పాలనలో పారదర్శకత పెరిగింది. ఈ పోర్టల్ ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయపు పన్ను నగదు రహిత చెల్లింపులు జరగడమే అందుకు నిదర్శనం. అంతే కాదు 13,350 పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా తీర్చిదిద్దారు. పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 77 డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
• జాతీయ స్థాయి అవార్డుల్లో సంచలనం
జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (Good Governance) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనోపాధి విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కింది. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామ పంచాయతీ తృతీయ స్థానాన్ని పొందింది. మండలం లేదా బ్లాక్ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి గాను చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు చేరే వరకు పని చేస్తుంది. గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లతో స్వయం సమృద్ధ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి.