
ఆమదాలవలస: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజలు స్థానిక శ్రీ పాలపోలమ్మ తల్లి ఆలయంలో జనసేన శ్రేణులతో కలిసి నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని, ఆయన ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్‌ను ఆ ధర్మమే కాపాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శిర్లపు గణేష్, గొద్దు కోటేశ్వరరావు, పొట్నూరు ప్రసాద్, హనుమంత అనుష్ కుమార్, గొండు రాము తదితరులు పాల్గొన్నారు.