ఎన్‌హెచ్-165 విస్తరణలో ఆర్టీఐతో వెలుగులోకి కీలక వివరాలు

కైకలూరు: నేషనల్ హైవే (ఎన్.హెచ్-165) విస్తరణ పనుల్లో పారదర్శకత కోసం ఆర్టీఐ (ఆర్.టి.ఐ) ద్వారా సమాచారం కోసం పోరాటం చేయగా కీలక వివరాలు బయటపడ్డాయని హైకోర్టు అడ్వకేట్ తణేకుల రవితేజ తెలిపారు.

నేషనల్ హైవే 165 (ఎన్.హెచ్-165) విస్తరణ పనులలో సామాన్య ప్రజల భద్రత మరియు మౌలిక వసతుల కల్పనపై చేసిన సుదీర్ఘ పోరాటం నేడు ఫలితాలను ఇస్తోందని హైకోర్టు అడ్వకేట్ రవితేజ పేర్కొన్నారు. రహదారి నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, భద్రతా ప్రమాణాల లోపంపై గత మార్చి 30, 2026న సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తుతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక మొదలైందనన్నారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గుడివాడ, పామర్రు, ముదినేపల్లి, మండవల్లి మరియు కైకలూరు ప్రాంతాలలో కొత్తగా నిర్మించబోయే బస్సు షెల్టర్ల కోసం కేటాయించిన నిర్దిష్ట బడ్జెట్ వివరాలు, కైకలూరు బైపాస్ కు సంబంధించిన అధికారిక లేఅవుట్ మరియు అలైన్‌మెంట్ మ్యాపుల ధృవీకరించబడిన ప్రతులు,

ముదినేపల్లి మరియు మండవల్లి వద్ద ప్రమాదాల నివారణకు జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్లు మరియు ఇంజనీరింగ్ డిజైన్లు వివరాలు,

గుడివాడ మరియు కైకలూరు నియోజకవర్గాల పరిధిలో అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు సేఫ్టీ సైన్ బోర్డుల ఏర్పాటు కోసం అనుమతించిన స్థలాలు మరియు బడ్జెట్ వివరాలు,

రహదారి వెంట నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల సాంకేతిక వివరాలు మరియు వాటి బడ్జెట్ కేటాయింపులపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడగగా అధికారులు స్పందించారని తెలిపారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పై అంశాల తీవ్రతను గమనించిన కేంద్ర ఉపరితల రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ దీనిని అత్యంత కీలకంగా పరిగణించిన మార్చి 31, 2026న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్&బి)కు బదిలీ చేసిందని, దీనిపై స్పందించిన రాష్ట్ర అధికారులు ఏప్రిల్ 08, 2026న ప్రత్యేక మెమో (నెం. 798/ఆర్.టి.ఐ /ఎన్.హెచ్&సి.ఆర్.ఎఫ్/పి.ఐ.ఓ/సి1/2026) జారీ చేస్తూ తాను కోరిన సమాచారాన్ని నిర్ణీత కాలపరిమితిలోగా అందజేయాలని విజయవాడ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారని రవితేజ విలేఖర్లకు తెలిపారు.

ప్రస్తుతం ఎన్.హెచ్-165 పరిధిలో కనిపిస్తున్న భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక వసతుల పనులపై గతంలో తాను ఆర్టీఐ యాక్టు ద్వారా అధికారుల పనితీరును ఒత్తిడి చేసి పలుమార్లు ప్రశ్నించడంతోనే నిర్మాణం పనులు వేగవంతం చేశారని అన్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి, అభివృద్ధి పనులలో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్న రవితేజ చొరవను స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.