ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు కోరుతూ మరిపల్లి గ్రామంలో నిరసన

సాలూరు నియోజకవర్గం: సాలూరు మండలం, మరిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతుల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ యాప్ హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కూలీలు మరియు నాయకులు కోరారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫేస్ యాప్ హాజరు విధానం వల్ల కూలీలకు పని లేకుండా పోతుందని, రోజూ పనికి వెళ్లినా హాజరు సమస్యల కారణంగా తిరిగి ఇంటికి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో మండలంలో వందలాది కూలీలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఐదు వారాలుగా పని చేసినా ఇప్పటికీ వేతనాలు అందలేదని చెప్పారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనులకు హాజరు కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇది మరింత ఇబ్బందిగా మారిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 100 శాతం ఇవ్వాలని, రోజుకు 600 రూపాయల వేతనం, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ఫేస్ యాప్ రద్దుతో పాటు రెండు పూటల పని విధానాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో కూలీలందరినీ సమీకరించి పెద్ద స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జన్ని ఈశ్వరరావు, ఆవాల బంగారు నాయుడు, రాజమండ్రి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.